తీరంలో హైఅలెర్ట్
అచ్యుతాపురం : హుదూద్ తుపాను పట్ల తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ సూచించారు. శుక్రవారం పూడిమడకను సంద ర్శించారు. మత్స్యకారులు, గ్రామనాయకులు, అధికారులతో చర్చించారు. శనివారం తీరప్రాంత ప్రజల్ని ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. హైస్కూల్, తుపాను షెల్టర్‌లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు. వాటిల్లో తాగునీరు, విద్యుత్, జనరేటర్, భోజన సౌకర్యాలను ఏర్పాటుచేయాలన్నారు.
విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 30వేల మంది తీరప్రాంత ప్రజల్ని 40 పునరావాసకేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. తుపాను తీవ్రత జిల్లాకు ఎక్కువగా ఉన్నందున తీరప్రాంతంలో హైఅలెర్ట్‌ను ప్రకటించామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశామన్నారు. పలుమార్లు దండోరావేసి మత్స్యకారులను అప్రమత్తంచేయాలని సూచించారు. గంటకు150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. పూరిగుడెసెలు, శిథిల భవనాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు.
ఒక్కరోజులో 24సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పరిస్థితిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. పడవలు, వేటసామగ్రిని భద్రపరుచుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో వసంతరాయుడు, తహశీల్దార్ వెంకటిశివ, ఎస్‌ఐ సన్యాసినాయుడు ఉన్నారు.