
'టీ.మంత్రుల్లో సగంమంది సీఎం కోవర్టులే'
హైదరాబాద్ : తెలంగాణ మంత్రుల్లో సగంమంది ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కోవర్టులేనని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఉదయం సమావేశాలకు వచ్చినవారే....సాయంత్రం సీఎంతో భేటీ అవుతున్నారని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసి నెలన్నర దాటుతున్న ఇంకా కేబినెట్ ముందుకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2009 నాటి పరిణామాలు పునరావృతమయే భయం ప్రజల్లో వ్యక్తమవుతోందని అన్నారు. తెలంగాణలో కొందరు మంత్రుల ప్రవర్తన చూస్తుంటే సిగ్గేస్తోందని కోమటిరెడ్డి అన్నారు.
తెలంగాణ వ్యవహారాన్ని ఇలాగే నాన్చితే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరని ఆయన తెగేసి చెప్పారు. తెలంగాణ మంత్రులు హైకమాండ్పై ఒత్తిడి చేయకపోవటం వల్లే విభజన ప్రక్రియ ముందుకు సాగటం లేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ మంత్రులు రాజీనామా చేసి అధిష్టానంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం కాకుండా ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో ఆలోచించారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.