బెత్తెడు జీతం ..బాధ్యతల భారం | Hand-breadth salary | Sakshi
Sakshi News home page

బెత్తెడు జీతం ..బాధ్యతల భారం

Published Wed, Mar 11 2015 3:07 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Hand-breadth salary

 పిట్టలవానిపాలెం : అంగన్‌వాడీ కార్యకర్తలతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తుందనే ఆందోళన  సర్వత్రా వ్యక్తమవుతోంది.  జీతాల పెంపుదల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన  చెందుతున్నారు. ఇచ్చే అరకొర జీతానికి అంగన్‌వాడీలతో ప్రభుత్వం అనేక రకాల పనులు చేయించు కొంటుంది. రెక్కలుముక్కలు చేసుకుంటున్నా వారి కడుపు నిండడం లేదు.
 
  గర్భిణులకు సీమంతం, ఓటరు నమోదు, పల్స్‌పోలియో, వివిధ రకాల వ్యాక్సినేషన్, వైద్య పరీక్షలు వంటి అదనపు బాధ్యతలు కూడా మోపుతున్నారు. వీటికితోడు 2013 నవంబర్ నుంచి రెండు పూటలా కేంద్రాన్ని నిర్వహించాలనే నిబంధన విధించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరచి ఉంచాలని ఆదేశించారు. పెంచిన పనివేళలతో పాటు వేతనాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
 అయితే ఇప్పటి వరకు వేతనాలు ఎంత పెంచారో కూడా అంగన్‌వాడీ కార్యకర్తలకు తెలియక పోవడమే కాకుండా పెంచుతామన్న వేతనం పత్తాలేకుండా పోయిందని వాపోతున్నారు.
 అంగన్‌వాడీ కార్యకర్తకు రూ. 4,200, ఆయాకు రూ. 2,200  వేతనాలను ప్రభుత్వం అందజేస్తోంది.
 
  కూలి పనికి వెళ్తే ఒక్కో మహిళ మధ్యాహ్నానికే రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు తెచ్చుకుంటున్నారని తమకు ఇన్ని బాధ్యతలు అప్పజెప్పి జీతాలు పెంచకుండా ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటుం దని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా అంగన్‌వాడీ వ్యవస్థ ప్రారంభమై 32 ఏళ్లు గడిచినా అధిక శాతం కేంద్రాలకు సొంతభవనాలు ఏర్పాటు చేయలేదు.
 
  ఫలితంగా చిన్నారులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. సొంత భవనాలు లేని కారణంగా కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య కూడా రోజు రోజుకు తగ్గిపోతోంది. శిథిలావస్థకు చేరిన భవనాలు, చెట్ల కింద, ఆరుబయట వరండాలు, తాటాకు పాకలలో చిన్నారులను కూర్చోబెడుతున్నారు.
 
 జిల్లాలో బాపట్ల నియోజకవర్గాన్ని పరిశీలిస్తే మొత్తం 253 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అధిక శాతం కేంద్రాలకు సొంతభవనాలు లేవనే చెప్పవచ్చు. అద్దెభవనాలకు  నెలకు రూ.750 చెల్లిస్తున్నారు. కచ్చితమైన కొలతలతో గది ఉండాలని, అందులో వంట గది, మరుగుదొడ్డి, ప్రహరీ ఉండాలంటూ ప్రభుత్వం మెలిక పెట్టింది.
 
 సర్వేయర్‌తో కొలతలు వేయించుకుని వస్తేనే పెరిగిన అద్దె చెల్లిస్తామంటూ తిరకాసు పెట్టింది. దీంతో చేసేదేమీ లేక కొన్ని గ్రామాలలో తామే సొంతంగా రూ.500 నుంచి రూ.1000 వరకు వెచ్చించి కేంద్రాలను నిర్వహిస్తున్నామని పలువురు అంగన్‌వాడీలు ఆవేదన చెందుతున్నారు.
 ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదు..
 
 ఏళ్ల తరబడి అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తున్నా అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామని కాలయాపన చేస్తున్నారు. మాగోడు పట్టించుకోవడం లేదు. కనీసం పెరిగిన నిత్యావసర సరుకుల ధరల కనుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నాం.
 - ఎన్. మార్తమ్మ, అల్లూరునత్తలవారిపాలెం,  అంగన్‌వాడీ కార్యకర్త
 
 సొంత భవనం లేక ఇబ్బంది..
 సొంత భవనం లేక పోవడం వల్ల నానా అవస్థలు పడుతున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల వరండాలో ఉండాల్సి వస్తుంది. పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఒక్కో సారి పాఠశాల విద్యార్థులకు ఇబ్బంది కలిగితే బయట చెట్టు కింద కూర్చుంటున్నారు.
 - ఎన్. సంతోషం, మండేవారిపాలెం అంగన్‌వాడీ కార్యకర్త
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement