సత్తుపల్లి టౌన్: చిన్నారుల దృష్టి కేంద్రాల వైపు మళ్లించేందుకు.. వారి మెదళ్లకు పదును పెట్టేందుకు.. రంగురంగుల బొమ్మలను గుర్తించేందుకు.. ఆటపాటలతో అర్థమయ్యేలా బోధించేందుకు ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోఅంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రుచికరమైన పౌష్టికాహారం అందిస్తూ.. నిర్వహణను పకడ్బందీగా చేపడుతున్నా.. ప్రస్తుతం కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆట బొమ్మలు కరువయ్యాయి. నాలుగేళ్లుగా కేంద్రాలకు ఆట బొమ్మల సరఫరా నిలిచిపోవడం.. ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకపోవడంతో చిన్నారులు పాత బొమ్మలు, విరిగిపోయిన ఆట వస్తువులతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రమాదవశాత్తు గాయాలపాలైన చిన్నారులకు ప్రాథమిక వైద్యం చేసేందుకు మెడికల్ కిట్లు లేకపోవడంతో విలవిలలాడుతూ ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట బొమ్మలు, మెడికల్ కిట్లు కరువయ్యాయి. ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకపోవడంతో చిన్నారులు పాత బొమ్మలతోనే ఆడుకోవాల్సిన పరిస్థితి జిల్లాలోని పలు కేంద్రాల్లో నెలకొంది.అలాగే ఆటపాటలతో చదువుకునే సమయంలో చిన్నారులకు ఏ చిన్న గాయమైనా ఇంటికో.. దగ్గరలోని ఆస్పత్రికో పరుగులు పెట్టాల్సి వస్తోంది. కేంద్రాల్లో పిల్లలు, తల్లులకు అత్యవసర సమయంలో మందులు అందించేందుకు ప్రాథమిక కిట్లు అందుబాటులో ఉంచాలి. కొన్నేళ్లుగా వీటి సరఫరా లేకపోవటంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అవస్థలు పడాల్సి వస్తోంది. ఆరేళ్లలోపు పిల్లలు ఎక్కువ సమయం తోటి పిల్లలతో కలిసి ఉండటం వల్ల ఇతరులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
అలాగే అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో ఉండటంతో గర్భిణులు, బాలింతలతోపాటు చుట్టుపక్కల మహిళలు కూడా మందుల కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ కేంద్రాల్లోనే వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంటారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత చిన్నారులు జ్వరం బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో ఉపశమనం పొందేందుకు వీలుగా పారాసిటమాల్ గోలీలు, సిరప్‌లు కూడా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలనేది స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్యోద్దేశం. కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏ కేంద్రంలో చూసినా ఖాళీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అంగన్‌వాడీ సిబ్బంది పెంపుపై దృష్టి సారించిన ప్రభుత్వం.. చిన్నారుల కోసం ఆట వస్తువులు, మెడికల్ కిట్లు సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు.
ఆట బొమ్మలు లేవు..
మా ఇద్దరు పాపలు అంగన్‌వాడీ కేంద్రానికే వస్తున్నారు. మూడేళ్ల నుంచి అంగన్‌వాడీ కేంద్రానికి వస్తున్నా.. కొత్త ఆట వస్తువులు లేవు. ఎప్పుడో ఇచ్చిన పాత బొమ్మలు విరిగిపోయాయి. వాటితో ఆడుకుంటే చిన్నారుల చర్మానికి గీసుకుపోయి గాయాలవుతున్నాయి. – ఎస్.సావిత్రి, సత్తుపల్లి
త్వరలో సరఫరా చేస్తాం..
వారం రోజుల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్లు సరఫరా చేస్తాం. అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్ కిట్లు, ఆట వస్తువులు, రిజిస్టర్లు కూడా ఈ నెలాఖరుకల్లా పంపిణీ చేస్తాం. పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. – ఆర్.వరలక్ష్మీ, ఐసీడీఎస్ పీడీ, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment