‘చీర-ధోవతి’తో చేనేతకు పూర్వ వైభవం | Handicrafts to its former glory | Sakshi
Sakshi News home page

‘చీర-ధోవతి’తో చేనేతకు పూర్వ వైభవం

Published Sun, Oct 5 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

‘చీర-ధోవతి’తో చేనేతకు పూర్వ వైభవం

‘చీర-ధోవతి’తో చేనేతకు పూర్వ వైభవం

‘జన్మభూమి- మా ఊరు’లో సీఎం చంద్రబాబు
రైతు, చేనేత, డ్వాక్రా రుణమాఫీ హామీలను నిలబెట్టుకుంటాం

 
కాకినాడ, సాక్షి ప్రతినిధి: చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు దివంగత ఎన్‌టీఆర్ ప్రవేశపెట్టిన ‘చీర-ధోవతి’ పథకాన్ని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేనేత రంగం అధోగతిపాలై, కార్మికులు కడుపునిండా తిండి తినే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. చేనేత రుణాలు మాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. పదేళ్ల క్రితం నిర్వహించిన ‘జన్మభూమి’ కార్యక్రమానికి ‘మా ఊరు’ను జోడించి, ప్రజలను గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అంగర, అనపర్తి గ్రామాల్లో శనివారం నిర్వహించిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అంగరలో ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకంలో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. జన్మభూమి సభలో వితంతు, వికలాంగ, వృద్ధాప్య, చేనేత పింఛన్లు పంపిణీ చేశారు. చేనేత కార్మికులకు పింఛన్లు, 300 చేనేత కిట్లు అందజేశారు. సర్పంచ్ బట్టా షణ్ముఖ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ ఏమన్నారంటే...
  గోదావరి నది పవిత్రత, తెలుగుజాతి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే తూర్పుగోదావరి జిల్లాలో జన్మభూమిలో పాల్గొనడం ఆనందంగా ఉంది. త్వరలో ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పింఛన్లను బ్యాంకుల ద్వారా అందించాలనుకుంటున్నాం.

చేనేత కార్మికులను ఆదుకునేందుకు వారు ఉత్పత్తిచేసే వస్త్రాలపై 30 శాతం రాయితీ ఇస్తాం. పేదలకు చేనేత చీరలు, ధోవతులను 50 శాతం సబ్సిడీపై అందజేయడం ద్వారా నేత కార్మికుల జీవనోపాధికి బాట వేస్తాం. రాష్ట్రం సమస్యల సుడిగుండంలో ఉంది. ఆదాయం ఎంత వస్తుందో తెలీదు. రైతుల రుణమాఫీకి ఆర్బీఐ అడ్డుపడగా, ఈ రాష్ట్రంలో చేస్తే అన్ని చోట్లా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. అయినప్పటికీ రుణమాఫీ చేస్తాం. రైతులకు దీపావళి కానుకగా 20 శాతం నిధులను బ్యాంకులకు జమ చేస్తాం. మిగిలిన 80 శాతం నాలుగు ఏళ్లలో జమ చేస్తాం. అంతవరకు ఆగే రైతులకు పది శాతం వడ్డీ కలిపి చెల్లిస్తాం. డ్వాక్రా మహిళలకు రుణభారం తగ్గింపు వంటి హామీలన్నింటినీ పూర్తి చేస్తాం. మహిళలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని సైతం తిరిగి వారికి ప్రభుత్వమే చెల్లిస్తుంది. మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 
సీఎంకు మహిళల నిరసన సెగ

అంగర, అనపర్తి జన్మభూమి సభల్లో అంగన్‌వాడీల నుంచి చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. అంగన్‌వాడీ కార్యకర్తలను తొలగించడంపై సీఐటీయూ ఆధ్వర్యంలో అంగరలో సభా వేదిక వద్ద నిరసనవ్యక్తం చేశారు. సీఎంకు వినతిపత్రం అందజేయాలన్న వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనపర్తిలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన అంగన్‌వాడీలపై చంద్రబాబు రుసరుసలాడారు. రాజకీయం చెయ్యొద్దంటూ మండిపడ్డారు. ఉద్యోగాలు తీసేసి తమను వీధిన పడేశారని ఆక్రోశించగా.. మీతో తర్వాత మాట్లాడతానంటూ సీఎం ప్రసంగాన్ని కొనసాగించారు. బ్యాంకు రుణాల చెల్లింపులపై కొందరు నిలదీయగా ఆ అంశాలపై తర్వాత మాట్లాడగలనని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement