కడప కల్చరల్ : డాక్టర్ వైఎస్సార్ హయాంలో జిల్లాలో పర్యాటకం పరుగులు తీసింది. ఊహించని స్థాయిలో ఆ రంగం అభివృద్ధి పథంలో పయనించింది. పర్యాటకం మాటే వినిపించని మన జిల్లాలో పదికి పైగా హరిత హోటళ్లు ఏర్పాటయ్యాయి. కానీ ఆ తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిర్వహణ బలహీనపడి ఈ హోటళ్లన్నీ ప్రైవేటుపరం అయ్యే దిశగా సాగుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
వరుస కరువులతో తల్లడిల్లుతున్న మన జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని, జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జిల్లాలోని 27 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించారు. దీంతోపాటు జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలలో పది హరిత హోటళ్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన కడప నగరంలో లగ్జరీ ఏసీ సూట్లు, రెస్టారెంట్లతో మంచి హోటల్‌ను నిర్మించారు. అనతికాలంలోనే దీనికి మంచి పేరు వచ్చింది. వ్యాపారం కూడా పెరిగింది. మిగతా హోటళ్లు కూడా క్రమంగా అభివృద్ధి బాట పట్టాయి. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ వైఎస్ ఆకస్మిక మరణంతో జిల్లాలో పర్యాటకాభివృద్ధికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన పాలకులు స్థానికులు ఎంతో మొరపెట్టుకున్నా అభివృద్ధిని కొనసాగించకపోగా, జిల్లా పట్ల వివక్ష చూపి అంగుళం కూడా అభివృద్ధి అయ్యేందుకు సహకరించలేదు.
లీజు దిశగా
ఒకప్పుడు లాభాలు చవిచూసిన కడప నగర సమీపంలోని ఆలంఖాన్‌పల్లె వద్ద ఉన్న హరిత రెస్టారెంట్, తాళ్లపాకలో ఉన్న హరిత రెస్టారెంట్‌లను లీజుకు ఇచ్చేశారు. దేవుని కడప, పాత కడప చెరువు గట్టుపైగల హరిత హోటల్ భవనాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. గోపవరం హరిత హోటల్‌లో కూడా వ్యాపారాలు లేకపోవడంతో మూసేశారు. దీన్ని లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మసాగర్ రిజర్వాయర్ వద్ద బోటింగ్ పరిస్థితి కూడా చతికిలపడింది. లైసెన్సులు గల డ్రైవర్లు మాత్రమే బోటు నడపాలని అధికారులు ఆదేశించడంతో లైసెన్స్ గల బోటు డ్రైవర్ లభించక బోట్లు మూలనపడ్డాయి. దీని నుంచి ఒక్క పైసా కూడా ఆదాయం వచ్చే అవకాశం లేదు. గోవపరంతోపాటు అత్తిరాల, మరికొన్ని ప్రాంతాల్లో హరిత భవనాలు ఇంతవరకు ప్రారంభానికే నోచుకోకపోవడం విశేషం. సిద్దవటంలో కోట వద్ద పాత భవనాన్ని రూ. 7 లక్షలు వెచ్చించి పర్యాటక హోటల్‌గా రీమోడల్ చేశారు. ఈ హోటల్‌లో సిద్దవటంలోని ఇతర హోటళ్లలో ధరలతో పోలిస్తే రెండు, మూడు అంతలు ఎక్కువగా ఉండడంతో స్థానికులు అటువైపు వెళ్లడం మానేశారు.
అంతర్గత ఆధిపత్య పోరు
హరిత హోటళ్లలోని ఉద్యోగుల మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. కార్యాలయ ఉద్యోగులు తమ కిందిస్థాయి ఉద్యోగులపై అధికార దర్పం చూపుతూ మానసికంగా హింసిస్తున్నట్లు తెలుస్తోంది. హోటల్ సిబ్బంది కూడా అవినీతి బాట పట్టారు. పది గదులు బుక్ అయితే సగం మాత్రమే చూపడం, పది భోజనాలు ఖర్చయితే అందులోనూ సగమే చూపడం, బార్‌లో బయటి మద్యం తెప్పించడం తదితర కారణాలతో నష్టాలను మాత్రమే చూపే పరిస్థితి ఏర్పడింది. పర్యవేక్షణ కోసం ఉండాల్సిన మేనేజర్లు ఈ ఉద్యోగుల వేధింపులకు తాళలేక చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు. జిల్లాలో దాదాపు ఆరు నెలలుగా మేనేజర్ లేరు. డిప్యూటీ మేనేజర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన హరిత హోటళ్లు ఇప్పుడు నష్టాల్లో మునిగిపోయాయి. ఇప్పటికే జిల్లాలోని సగం çహోటళ్లు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేశారు. మిగతా హోటళ్లనైనా కాపాడుకోలేక పోతే అవి కూడా ప్రభుత్వం చేజారిపోయే ప్రమాదముందని ప్రజలు పేర్కొంటున్నారు.
నష్టాలు ఎందుకు? మొన్నటివరకు లాభాల బాటన
పరుగులు తీసిన హరిత హోటళ్ల వ్యాపారం ఇటీవల పర్యాటకుల సందడి పెరుగుతున్న నేపథ్యంలో హోటళ్లు దివాళా తీయడం పట్ల విమర్శలు రేగాయి. పర్యాటకరంగం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు వచ్చిన లాభాలు ఈ రంగం అభివృద్ధి చెందాక ఎందుకు రావడం లేదు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అందుకే ఈ çహోటళ్ల నిర్వహణ తెల్ల ఏనుగులా మారింది. అధికారుల్లో అసహనం మొదలై చివరికి వీటిని లీజుకు ఇచ్చేస్తే కనీస మొత్తానికి గ్యారంటీ ఉంటుందని భావించారు. జిల్లాలోని హరిత హోటళ్లలో ఇప్పటికే కొన్నింటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేయగా, మిగతావి కూడా దాదాపు అదే బాటలో ఉన్నాయి.
అన్నీ నష్టాల బాటే
జిల్లాలో అత్యధికంగా వ్యాపారం జరుగుతున్న హరిత హోటళ్లలో గండికోట హోటల్ ఒకటి. ఒకప్పుడు నెలకు రూ. 7.50 లక్షలు వ్యాపారం జరిగేది. వారాంతాల్లో ఎక్కువ మంది పర్యాటకులు వచ్చినపుడు రూ. 9–10 లక్షల వరకు వ్యాపారం జరిగేది. ఇక్కడ 53 గదులు, ఒక డార్మెంటరీ ఉన్నాయి. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత లోపం, అందించడంలో ఆలస్యం అంశాలపై విమర్శలు ఉన్నాయి. నిర్వహణలో లాభాల కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కడప నగరంలోని ప్రధాన హరిత హోటల్‌లో ఉన్న గదుల్లో వసతి లేమి కారణంగా దాదాపు సంవత్సరం నుంచి పలు గదుల్లో మరమ్మతులు జరుగుతున్నాయి. రెస్టారెంట్ పూర్తిగా మూతపడింది. ఒకప్పుడు రోజుకు రూ. లక్షకు పైగా జరిగే వ్యాపారం ప్రస్తుతం రూ. 20–30 వేలకు దిగజారింది. అంతో ఇంతో జరుగుతున్న బార్‌పై మాత్రమే కొద్దిగా లాభం చూడగలుగుతున్నారు. ఇడుపులపాయ హరిత హోటల్ కూడా భారీగానే నిర్మించారు. ఇందులో 23 గదులు ఉన్నాయి. విశాలమైన ఇలాంటి గదులు జిల్లాలోని ఏ హరిత హోటళ్లలోనూ లేవు. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. రోజురోజుకు వ్యాపారం మందగించి ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment