సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 ఏళ్లు ఓ వ్యక్తి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేసినా ఉన్నతాధికారులు గుర్తించకపోవడం ఆశ్చర్యమే. ఏడాది తేడాతో పదవీ విరమణ పొందిన ఆయన.. మొదటి ఉద్యోగానికి సంబంధించిన పింఛన్ కూడా తీసుకుంటున్నాడు. రెండో ఉద్యోగానికి సంబంధించిన పింఛన్ కోసం అకౌంటెంట్ జనరల్‌కు ప్రపోజల్ పంపగా మంజూరు చేసేశారు. సంబంధిత మొత్తం జిల్లా ట్రెజరీ కార్యాలయానికి చేరుకోగా.. అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టారు. ఎట్టకేలకు ఆయన బాగోతం బట్టబయలైంది. అధికార యంత్రాంగం కళ్లుగప్పిన లక్ష్మయ్య ఉదంతం గుట్టురట్టు చేసిన కర్నూలు ఉప ఖజానా అధికారి బాపనపల్లి వెంకటేశ్వర్లుకు ప్రభుత్వం నగదు రివార్డును ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు విఠల్‌నగర్‌కు చెందిన బి.లక్ష్మయ్య తన 19వ యేట.. అంటే 1971లో విద్యుత్‌శాఖలో వైర్‌మన్‌గా ఉద్యోగంలో చేరారు. సరిగ్గా పదేళ్ల తర్వాత మరో శాఖలో ఉద్యోగం పొందారు. 1981లో వ్యవసాయ విస్తరణాధికారికిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి రెండు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ ఎంచక్కా ప్రభుత్వ సొమ్ము కాజేశారు.
ఏడాది కాలంలో రెండు శాఖల్లో పదవీ విరమణ
లక్ష్మయ్య 2010లో వైర్‌మన్‌గా, 2011లో వ్యవసాయ విస్తరణాధికారిగా పదవీ విరమణ చేశారు. మొదట ఉద్యోగానికి పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ రూ.1,67,824లు పొందారు. ఈ మొత్తాన్ని 2010 మార్చి 3న చెక్‌నంబర్ 947108 ద్వారా బ్యాంక్ నుంచి డ్రాచేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి నెలా రూ.5,283 పింఛన్ పొందుతున్నారు. రెండో ఉద్యోగం పదవీ విరమణ అనంతరం పింఛన్ కోసం డిపార్ట్‌మెంటల్ అకౌంటెంట్ జనరల్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం లక్ష్మయ్యకు ప్రభుత్వం నెలకు రూ.6,062 బేసిక్ మంజూరు చేసింది. దాన్ని జిల్లా ఉపఖజానా కార్యాలయానికి పంపారు. లక్ష్మయ్యపై అనుమానం వచ్చి ఉన్నతాధికారులు జిల్లా ఉపఖజానా అధికారి బాపనపల్లి వెంకటేశ్వర్లుకు విచారణ జరిపి నిజానిజాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎట్టకేలకు లక్ష్మయ్య రెండు ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తూ యథేచ్ఛగా నెలనెలా వేతనం పొందుతున్నట్లు గుర్తించారు.
ఆ మేరకు వెంకటేశ్వర్లు ఉన్నతాధికారులకు పూర్తి వివరాలతో నివేదిక అందజేశారు. మోసాన్ని బట్టబయలు చేసిన జిల్లా ఉపఖజానా అధికారికి ప్రభుత్వం రూ.20వేల నగదు అవార్డు ప్రకటించింది. ఇదిలాఉండగా లక్ష్మయ్య రెండు శాఖల్లో ఒకే సమయంలో విధులు ఎలా నిర్వహించారనేది మిస్టరీగా మారింది. వ్యవసాయ విస్తరణాధికారి ఎక్కువగా ఫీల్డ్‌లో తిరగాల్సి ఉంటుంది. ఇదే లక్ష్మయ్య వైర్‌మన్‌గా విధులు నిర్వర్తించేందుకు కలిసొచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఒక వ్యక్తి 29 సంవత్సరాలు అంటే 348 నెలలు రెండు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నా పై అధికారులు గుర్తించలేకపోవడం సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
హమ్మ.. లక్ష్మయ్యా!
Published Tue, Nov 12 2013 1:39 AM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM
Advertisement
Advertisement