రూ. 90, రూ. 120.. రెండు శ్లాబుల్లో వసూలు
దంపతులిద్దరూ ఉద్యోగులైతే.. ప్రీమియం ఒక్కరు చెల్లిస్తే చాలు
సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగులూ హెల్త్‌కార్డుకు అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకం ప్రీమియాన్ని(చందాను) ఈ నెల జీతం, పెన్షన్ నుంచే వసూలు చేయనున్నారు. డిసెంబర్ 1న చెల్లించనున్న నవంబర్ జీతం నుంచి ప్రీమియం వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల జీతపు శ్రేణిని బట్టి రెండు శ్లాబుల్లో ప్రీమియం వసూలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి వీలుగా హెల్త్‌కార్డుల పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. డిసెంబర్ 1 నుంచి మెడికల్ రీయింబర్స్‌మెంట్ రద్దు కానుంది. జీవోలోని ముఖ్యాంశాలు ఇవీ..
హాడిసెంబర్ 1న ఉద్యోగులకు/పెన్షనర్లకు అందనున్న నవంబర్ జీతం/పెన్షన్ నుంచి ప్రీమియం వసూలు చేయడం ప్రారంభమవుతుంది. 1 నుంచి 4 వరకు ఉన్న జీతపు శ్రేణిలో ఉన్న ఉద్యోగులను శ్లాబ్-ఎ, 5 నుంచి 17 వరకు జీతపు శ్రేణిలో ఉన్న ఉద్యోగులను శ్లాబ్-బి కింద విభజించారు. శ్లాబ్-ఎ, బి కింద చేర్చిన ఉద్యోగుల నుంచి నెలకు రూ. 90, శ్లాబ్-సి కింద ఉన్న ఉద్యోగుల నుంచి రూ. 120 వసూలు చేయనున్నారు. పెన్షనర్లు పదవీ విరమణ చేసిన నెల్లో పొందిన జీతపు శ్రేణి ఆధారంగా శ్లాబ్ నిర్ణయిస్తారు. ఆ మేరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. శ్లాబ్ ఎ, శ్లాబ్ బి కింద రూ.6,700 నుంచి రూ.15,280 వరకు జీతపు శ్రేణి ఉన్న ఉద్యోగులున్నారు. శ్లాబ్ సి కింద రూ.16,150 నుంచి రూ.44,740 వరకు జీతపు శ్రేణి ఉన్న ఉద్యోగులుంటారు.
హాహెల్త్‌కార్డుల పథకానికి ఏటా రూ. 220 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అందులో ఉద్యోగులు ప్రీమియం ద్వారా 40 శాతం సమకూర్చుకోనున్నారు. మిగతా 60 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చనుంది. శ్లాబ్-ఎ, బి కింద చేర్చిన ఉద్యోగులకు ప్రభుత్వం నెలకు రూ. 135, శ్లాబ్-సి ఉద్యోగులకు రూ. 180 చెల్లించనుంది.
- దంపతులు ఇద్దరూ ఉద్యోగులు/పెన్షనర్లు అయితే.. ఎవరైనా ఒకరు ప్రీమియం చెల్లిస్తే చాలు. అయితే ఈమేరకు ఒకరు ప్రీమియం చెల్లిస్తున్నట్లు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
- దీర్ఘకాలపు సెలవులో ఉన్న ఉద్యోగుల ‘లీవ్ శాలరీ’ నుంచి ప్రీమియం వసూలు చేస్తారు. జీతం లేని సెలవులో ఉన్న ఉద్యోగులు ప్రతినెలా తొలివారంలో ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం నిధి’కి చలాన్ ద్వారా ప్రీమియం చెల్లించాలి.
- సెస్పెన్షన్‌లో ఉండి జీతం లేని ఉద్యోగులు కూడా చలాన్ ద్వారా ప్రతినెలా తొలివారంలో ప్రీమియం చెల్లించాలి.
- డిసెంబర్ 1 నుంచి మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను తీసుకోవద్దని డ్రాయింగ్ ఆఫీసర్లకు ప్రభుత్వం సూచించింది.
ఈ నెల నుంచే ‘హెల్త్’ ప్రీమియం
Published Sun, Nov 16 2014 2:00 AM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement