చేగుంటలో ఆరోగ్య కార్యదర్శి హల్‌చల్
చేగుంట, న్యూస్‌లైన్: మండల కేంద్రమైన చేగుం టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి కేశవ్ దేశిరాజు శనివారం సందర్శించారు. ఆయనతో పాటు వచ్చిన రాష్ట్ర ఐఏఎస్ అధికారులు కూడా ఆస్పత్రి పనితీరును తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్యసేవల గురించి స్థానిక డాక్టర్ రాకేశ్‌ను ప్రశ్నిం చారు. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్‌ఎంలు ఉండేందుకు క్వార్టర్లు ఉన్నాయా, ఉంటే ఎన్ని ఆస్పత్రులకు ఉన్నాయని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
డివిజన్ పరిధి లో 135 సబ్‌సెంటర్లు ఉండగా 16 కేంద్రాల్లో క్వార్టర్ల నిర్మాణం జరిగిందని సీహెచ్‌ఓ సునీల్ తెలిపారు. 135 సబ్ సెంటర్లలో క్వార్టర్ల ఏర్పాటుకు 20 ఏళ్లు పడుతుందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని పలు విభాగాలను పరిశీలించి పనితీరు తెలుసుకున్నారు. చేగుంట జాతీయ రహదారిపై ఉన్నందున పనివేళలను పెంచి 24 గంటల వైద్య సేవలు అందేలా చూడాలని స్థానికులు కమిషనర్లను కోరారు. త్వరలోనే చేగుంటలో 24గంటల సేవలు అందేలా చూడాలని సంబంధిత అధికారులకు కమిషనర్లు సూచించారు. ఆయన వెంట ఇన్‌చార్జ్ కలెక్టర్ శరత్, కమిషనర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జిల్లా వైద్యాధికారి పద్మ, ఎన్‌ఆర్ హెచ్‌ఎం డీపీఓ జగన్నాథ్‌రెడ్డి, ఆర్డీఓ వనజాదేవి తదితరులు పాల్గొన్నారు.
వంటశాల నిర్వహణపై ఆగ్రహం
వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట అంగన్‌వాడీ కేంద్రంలోని వంటగది నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి కేశవ్ దేశిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటశాల నిర్వహణ బాగా లేదని, గ్యాస్ పొయ్యిపైనే వంట చేయాలని ఆదేశించారు. శనివారం మాసాయిపేటలో మార్పు సమన్వయ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన అంగన్‌వాడీ కేంద్రంలోని వంటగదిని పరిశీలించారు. పొగచూరి నల్లగా ఉన్న గోడలు, కట్టెల పొయ్యి, రాళ్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుదల, గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు, పరిశుభ్రత తదితర విషయాలను పరిశీలించారు. అమృతహస్తం పథకం కింద అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం చేస్తున్న గర్భిణులను, బాలింతలను ఆయన పలకరించారు. పాలు, గుడ్లు ఎలా సరఫరా చేస్తున్నారనే విషయాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.