
విజయనగరం ఫోర్ట్ : వేసవితాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది చల్లగా ఉండే శీతలపానీయాలు, చల్లటి పదార్థాలు తీసుకుంటారు. దీని వల్ల వేసవి నుంచి ఉపశమనం పొందలేరు సరికదా మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశ ఉంది. తియ్యగా ఉండే షర్బత్, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, బాదంమిల్క్, లస్సీ వంటివి తీసుకోవడం వల్ల ఆ క్షణానికి చల్లగా ఉంటుందే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనీసం వడదెబ్బ బారి నుంచి కూడా కాపాడలేదు. పైగా చాలామంది ఐస్‌క్రీమ్‌లు, గడ్డ కట్టిన రస్నాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. అటువంటి వాటి వల్ల గొంతు సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్స్‌తో పాటు టాన్సల్స్ వచ్చే ప్రమాదం ఉంది.
తీసుకోవాల్సినవి..
ఉప్పు కలిపిన మజ్జిగ, నీరు, ఉప్పు కలిపిన నిమ్మరసం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తీసుకోవాలి. వీటివల్ల వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది.
వ్యాధులు వచ్చే అవకాశం..
ఐస్‌క్రీమ్స్, ఇతర శీతల పానీయాల వల్ల గొంతు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తీసుకుంటే మంచిది. వ్యవసాయకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఫుట్‌పాత్ వ్యాపారులు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. డాక్టర్ పెనుమత్స రామకృష్ణంరాజు, ఈఎన్‌టీ వైద్యుడు , కేంద్రాస్పత్రి