లవ్....డబ్......
ప్రేమ ఓ అనుభూతి. పవిత్రభావన. మనసులో ప్రేమ ఎందుకు,ఎప్పుడు,ఎలా పుడుతుందో చెప్పడం కష్టం. ఈ సృష్టి ఉన్నంత వరకూ ప్రేమ అజరామరం. ప్రేమించడం సహజం.. అయితే ఆ ప్రేమను జీవితాంతం నిలుపుకోవడంలోనే ఎంతోమంది విఫలమవుతున్నారు. నేడు ప్రేమికుల దినం. అదేనండీ... వాలెంటైన్స్ డే. ఈ నేపథ్యంలో ఒకప్పటి ప్రేమకు, ఇప్పటి ప్రేమకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషిస్తూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం
నేటి యువతీయువకుల్లో కళాశాల సమయంలో మొదలవుతోన్న ప్రేమ ఆయా చదువులు పూర్తయ్యేసరికి పెళ్లిగా రూపాంతరం చెందుతోంది. ఒకప్పుడు ఇష్టమైన యువతికి ప్రేమను వ్యక్తీకరించేందుకు యువకులు సంవత్సరాల తరబడి వేచిచూసేవారు. ఆ అమ్మాయి అందంతో పాటు అభిరుచుల్ని, ఇష్టాలను గౌరవించి అప్పుడే తమ ప్రేమను వ్యక్త పరిచేవారు. నేటి వేగవంతమైన సమాజంలో ప్రేమ అనే రెండక్షరాలకు అర్థాలు మారాయి. యువత అభిరుచులూ మారాయి. కాలాన్ని బట్టి ప్రేమను వ్యక్తం చేసే పద్ధతులూ మారాయి. ప్రేమలోనూ వేగం పెరిగింది. పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న వాలెంటైన్స్ సంస్కృతి నేటి యువతకు పండగ రోజులా మారింది.
ఈరోజు కోసమే
ఏడాదికాలంగా వేయికళ్లతో ఎదురుచూసేది ఈ రోజుకోసమే... ఈరోజును మధురానుభూతిని పంచేలా..జీవితాంతం గుర్తుండేలా గడపాలని ఎన్నో..ఎన్నెన్నో ఊహలు... ప్రణాళికలు... వాటన్నిటినీ సాకారం చేసుకునే సమయం వచ్చేసింది. ప్రేమికులు, కొత్తగా పెళ్ళయిన వారు. పెళ్లి చేసుకోనున్నవారు... ఒకరికొకరు ఆప్యాయంగా బహుమతులు అందజేసి తమ ప్రేమను వ్యక్తం చేసేదీ రోజే.. ప్రేమికుల రోజు(వాలెంటైన్స్ డే)ను పురస్కరించుకుని పట్టణంలోని అనేక ఫ్యాన్సీ, గిఫ్ట్స్ ఆర్టికల్స్ షాపులు వివిధ రకాల వాలెంటైన్స్‌డే గిఫ్ట్‌లు సిద్ధం చేశాయి. లవ్ సింబల్స్‌తో కూడిన టెడ్డీబేర్స్, పిల్లోస్, బ్యాండ్స్, కీచైన్స్, గ్రీటింగ్ కార్డ్స్, బొకేస్ వంటి రకరకాల గిఫ్ట్స్ ప్రేమికులను రారమ్మని పిలుస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన వివిధ రకాల లవర్స్ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రేడియంతో తయారుచేసిన బొమ్మలు మార్కెట్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆర్టికల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని దుకాణదారులు చెబుతున్నారు. వీటి ధర సుమారు రూ.2500 దాకా ఉంది. తమ ప్రేమను తెలియజేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తూ ... విలువైన బహుమతులు అందజేసేందుకు ప్రేమికులు సన్నద్ధమవుతున్నారు. ప్రేమికుల రోజును మధురాతిమధురంగా గడపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.,
నరసరావుపేట ఈస్ట్