
అమ్మో జూన్..!
- బెంబేలెత్తిస్తున్న స్కూల్ ఫీజులు
- జిల్లాలో ఒక్క నెలలో రూ.150 కోట్ల ఖర్చు
- తల్లిదండ్రులకు తలకు మించిన భారం
జూన్ అంటేనే సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. పాఠశాలల అడ్మిషన్, టెర్మ్ ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, ఇతర స్టేషనరీ అన్నింటి భారం ఒకేసారి నెత్తిన పడుతుంది. దీంతో సామాన్యుడిపై దాదాపు రూ.30 వేల భారం ఒకేసారి పడనుంది.
శ్రీనివాస్ ఓ చిరుద్యోగి. తన కుమారుడిని నాలుగో తరగతిలో చేర్చేందుకు పటమట లోని ఒక కార్పొరేట్ విద్యాసంస్థకు వెళ్లాడు. అక్కడి ఫీజుల చిట్టా చూసి అవాక్కయ్యాడు. వార్షిక ఫీజు రూ.40 వేలు, పుస్తకాలకు రూ.4 వేలు, స్కూల్ యూనిఫాం రూ.3,500, స్కూల్ షూస్, సాక్సులు కలిపి రూ.1500, ఇవి కాకుండా మెడికల్, ఇతర అవసరాల కోసం రూ.2 వేల డిపాజిట్ చెల్లించాలి. వీటిలో ఫీజు మాత్రమే మూడు వాయిదాల్లో చెల్లించాలి. మిగిలినవన్నీ అడ్మిషన్ సమయంలోనే చెల్లించాలన్నది ఆ చిట్టాలో చివరన ఉన్న నిబంధన.
సాక్షి, విజయవాడ : జూన్ నెల వచ్చిం దంటే సాధారణ ఉద్యోగి జేబుకు భారీ చిల్లుపడినట్లే. స్కూల్ ఫీజులు మొదలు అన్ని ఖర్చులు ఒక్కసారిగా మీదపడతాయి. స్కూల్ స్థాయిని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు ఈ నెలలోనే ఖర్చు పెట్టకతప్పని పరిస్థితి. జిల్లాలో 3,340 ప్రభుత్వ పాఠశాలలు, సుమారు 1200 వరకు ప్రయివేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరు లక్షల మంది వరకు విద్యార్థులు ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. ఈ నెల 15 నుంచి నూతన విద్యా సంవత్సరం మొదలవుతుంది. ప్రభుత్వ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఈ నెల 10 నుంచి కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. ఒక్క జూన్ నెలలోనే జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం రూ.150 కోట్ల పైనే ఖర్చుచేయాల్సి వస్తోంది.
కార్పొరేట్‌కు పడని ముక్కుతాడు
కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల నియంత్రణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలై మెంది. నిబంధనల ప్రకారం ప్రతి కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం ఫీజుల చిట్టాలను జిల్లా విద్యాశాఖకు సమర్పించి ఆమోదం పొందాలి. విద్యాసంవ్సరం ప్రారంభానికి ముందే పాఠశాలల్లో వసతులను విద్యాశాఖ అధికారులు పరిశీలించాలి. ప్రముఖ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లను ఉచితంగా పేద విద్యార్థులకు ఇవ్వాలి. అయితే వీటిలో ఏ ఒక్కటీ అమలు కావడంలేదు. స్కూల్స్ నిర్ణయించిన ఫీజుల్లో 30 శాతం లాభం, 70 శాతం స్కూల్ నిర్వహణ, సిబ్బంది జీతాలకు కేటాయించాలి. అయితే 70 శాతం లాభం, 30 శాతం నిర్వహణ ఖర్చుగా మారింది.
తనిఖీలు చేస్తాం
పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రస్తుతం బిజీగా ఉన్నామని, మూడు రోజుల తర్వాత నుంచి జిల్లాలోని ప్రయివేట్ పాఠశాలలను తనిఖీ చేస్తామని జిల్లా విద్యాశాఖధికారి కె.నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. స్కూల్స్‌లో సౌకర్యాలను, ఫీజుల వివరాలు, అన్నింటిని పరిశీలించి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశిస్తామన్నారు. నిబంధనలు పాటించ కుంటే చర్యలు తప్పవని పేర్కొన్నారు.