
కొనకనే కన్నీళ్లు
- కిలో రూ.70లకు చేరిన ఉల్లిపాయలు
- తగ్గిన సాగుబడి
- ఆందోళన పుట్టిస్తున్న ధరలు
- రేషన్‌కార్డు ఉంటేనే ఉల్లిగడ్డలు
- ఇదేమి చోద్యమంటున్న వినియోగదారులు
కడప అగ్రికల్చర్: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది నానుడి. అలాంటి ఉల్లి ఇప్పుడు వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లిపంట సాగు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఉల్లిధరలు అదుపు తప్పాయి. నైరుతి రుతుపవనాలు వచ్చినా వర్షం జాడలేకపోవడం, అరకొరగా ఉన్న భూగర్భజలాలు అడుగంటిపోవడం, బోరుబావులు ఎండిపోతుండడం, దీనికి తోడు కరెంటు కోతలతో రైతులు బోరుబావుల కింద ఉల్లి పంట సాగు చేయాలంటే జంకుతున్నారు. దీంతో ప్రతి నెలా ధరలు పెరుగుతూ పోతున్నాయి.
జూన్, జూలై నెలలో రూ.14-15లు ఉన్న కిలో ఉల్లి ధరలు, ఆగస్టు ఆరంభం నుంచి ఆ ధర కాస్త రూ. 18-20లకు చేరి క్రమంగా ఎగబాకుతూ పోతోంది. మార్కెట్‌లో రోజు రోజుకు రూ.5,10 చొప్పున ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ధర కడప పెద్దమార్కెట్‌లో రూ. 60-70 మధ్య పలుకుతోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి మార్కెట్‌లలో అయితే కిలో రూ.70-80 మధ్య వ్యాపారులు విక్రయిస్తున్నారు.
నిన్న ఆధార్ కార్డన్నారు...
నేడు రేషన్‌కార్డు ఉంటేనే ఉల్లిగడ్డలంటున్నారు
జిల్లా యంత్రాంగం ఆదేశాలతో మార్కెటింగ్, జిల్లా పౌరసరఫరాలశాఖలు సంయుక్తంగా కడప రైతుబజారులోను, జిల్లాలోని రాజంపేట, బద్వేలు, కమలాపురం, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో ఉల్లిగడ్డల విక్రయాలను చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్‌కార్డులను తప్పనిసరిచేసి అన్ని పథకాలకు ఆధార్ తప్పని సరి అని చెబుతూ ఇప్పుడేమో రేషన్‌కార్డు ఉంటేనే ఉల్లిపాయలు ఇస్తామని చెప్పడం ఇదెక్కడి చోద్యమని కార్డులు లేని నిరుపేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లి దిగుబడుల కోసం మార్కెట్ అధికారుల
వెంపర్లాట : ఉల్లిపాయల ధరలు రోజు రోజుకు ఎగబాకుతుంటే ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు రావడంతో ఉల్లిపంట జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో అధికంగా పండిస్తారో ఆయా గ్రామాల రైతులను కలుసుకుంటూ ఎక్కడ ఉల్లిపంట ఉన్నా మార్కెట్‌యార్డుకు తీసుకురావాలని చెబుతున్నారు. అలాగే రైతు బజారులో ఉంచి అమ్మకాలు చేయిస్తున్నారు.
అరకొర సాగు : ఈసారి ఎల్‌నినోతో వర్షాలు సంపూర్తిగా కురవ వని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుండడంతో ఉల్లిపంటసాగుకు రైతులు ముందుకు రావడ ం లేదు. ప్రధానంగా పెండ్లిమర్రి, వేంపల్లె, వేముల, పులివెందుల, ముద్దనూరు. వీరపునాయునిపల్లె, కడప, సిద్ధవటం, చింతకొమ్మదిన్నె, బి.మఠం, మైదుకూరు, ఖాజీపేట, చాపాడు, రాజుపాలెం, దువ్వూరు మండలాల్లో అధికంగాను, మిగిలిన మండలాల్లో తక్కువగాను మొత్తం కలిపి దాదాపు 12,500 ఎకరాల్లో ఉల్లిపంటను ఏటా సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 1400 ఎకరాల్లో కూడా పంట సాగుకు నోచుకోలేదు.
దిగుమతులు కూడా తక్కువే....:
డిమాండ్‌కు తగ్గట్లు స్థానికంగా పంట లేకపోవడంతో జిల్లా వ్యాపారులు కొందరు మహరాష్ట్ర, బళ్లారి, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా అక్కడ కూడా పంటలేదని వ్యాపారులు అంటున్నారు. ఈ ధరలు మరింతగా పెరుగుతాయనే ఉద్దేశంతో వ్యాపారులు కొందరు జిల్లాలోని అరకొర పంటను అప్పుడే రహస్య గోదాముల్లో అక్రమంగా నిల్వ చేశారని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో గతంలో ఒకటి రెండు కిలోల ఉల్లిగడ్డలను కొనుగోలు చేసే వినియోగాదారులు ఇప్పుడు అరకిలో, పావుకిలో కొనుగోలుతో సరిపెట్టుకుంటున్నారు.
రేషన్‌కార్డులు అంటే ఎట్లా..
రేషన్‌షాపుల్లో సరుకులకు మాత్రమే ఉపయోగించుకునే రేషన్‌కార్డును ఇలా ఉల్లిపాయలకు వినియోగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఉల్లిగడ్డలకు వచ్చే వారు తప్పని సరిగా ఆధార్‌కార్డు తీసుకురావాలన్నారు. నేడేమో దాన్ని పక్కనబెట్టి రేషన్‌కార్డు తీసుకురమ్మనడం ఎంతవరకు సమంజసం.
- విజయలక్ష్మీ, గృహిణి,మత్యుంజయకుంట, కడప నగరం
అందరికి కార్డులు ఉండాలి కదా...:
రేషన్‌కార్డుల కోసం చాలామంది దర ఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు కార్డులు రాలేదు. అన్నింటికి ఆధార్‌కార్డులే ముఖ్యమని, ఇప్పుడు మళ్లీ రేషన్‌కార్డులు తప్పని సరిగా తీసుకురావాలని చెప్పడం దారుణం.
- తస్లీమా,నకాష్, గృహిణి, కడప నగరం