జిల్లా రైతన్న పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా తయారైంది. 12 ఏళ్లలో 9 ఏళ్లు తీవ్ర కరువుతో నలిగిపోయిన రైతుపై అకాల వర్షాలకు కూడా దయలేకుండా పోయింది. అవసరమైనప్పుడు కనిపించని వరుణుడు అవసరం లేనప్పుడు వడగండ్లు కురిపించాడు. వరుణుడికి గాలిదేవుడు తోడయ్యాడు.. కరువు రైతుపై కరుణ చూపించకపోగా కలసికట్టుగా విరుచుకుపడ్డారు. కంటికి రెప్పలా చూసుకున్న కాసింత పంటలను కబలించారు. ముఖ్యంగా పండ్ల తోటలు భారీగా దెబ్బతిన్నాయి. నష్టం కోట్లలోనే ఉంటుందని అనధికారిక అంచనా.
అనంతపురం అగ్రికల్చర్: గాలివాన పంజా విసిరింది.. దానికి తోడైన అకాల వర్షం అరటి, బొప్పాయి, మామిడి, వరి, పత్తి, కూరగాయలు, ఆకు, వక్క తోటలను దెబ్బతీశాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా రైతులు రూ.20 కోట్లకు పైగా పంట ఉత్పత్తులు కోల్పోగా మరోసారి రూ. కోట్లలో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది.
గురువారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలకు అధికారులు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు వరి, ప్రత్తి పంటలకు రూ.28 లక్షలు నష్టం వాటిల్లగా అరటి, ఆకు, వక్క, మామిడి తోటలకు రూ.20 లక్షలకు పైగా నష్టం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి నష్టం సమాచారం రావాల్సి ఉండటంతో ఎంతలేదన్నా రూ.కోటికి పైగా నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుంతకల్లు మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. పామిడి మండలంలో వర్షానికి అరటి, టమోటా పంటలు దెబ్బతిన్నాయి. కళ్యాణదుర్గం మండలంలో రూ.8 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం.
మండల పరిధిలోని పాపంపల్లి, మోరేపల్లి, గరుడాపురం, కోడిపల్లి తదితర గ్రామాల్లో వరి, అరటి, మామిడి పంటలు నేలకొరిగాయి. అలాగే కంబదూరు మండలంలో కూడా కర్తపనర్తి, రాంపురం, ఐపార్శిపల్లి, కంబదూరు గ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన వడగండ్లు వర్షానికి కర్భూజ మామిడి, వరి, మొక్కజొన్న, రాగి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రూ.20 లక్షలకు పైగానష్టం వాటిల్లింది. బ్రహ్మసముద్రం మండలం కపటలింగనపల్లి కొట్టాలు, ఇల్లు, రెండు తమల పాకుతోటలు ధ్వంసమయ్యాయి. అలాగే పిల్లలపల్లి గ్రామంలో అరటితోట, కోళ్ళఫారం, టమాట తోటలతో పాటు కర్భూజ తోటలు వడగండ్ల వానకు పూర్తి ధ్వంసమైన నేలమట్టమయ్యాయి. దీంతో సుమారు రూ.30లక్షలు నష్టం వాటిల్లినట్లు అంచనా. కుందుర్పి మండలంలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మడకశిర మండలంలో పిడుగుపాటుకు గేదె మృత్యువాత పడింది. అమరాపురం మండలంలో వక్కతోట, టమోట పంటలు దెబ్బతినడంతో రైతులకు రూ.లక్షల రూపాయల నష్టం జరిగింది. అలాగే రొద్దం మండలం 50 ఎకరాల్లో మామిడితోటలకు నష్టం జరిగింది. రాయదుర్గం, కనేకల్లు, గుమ్మగట్ట మండలాల్లో కూడా పంటలకు భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. పుట్లూరు, పెద్దవడుగూరు, పామిడి, బెళుగుప్ప, ఉరవకొండ మండలాల్లో కూడా పంటలకు నష్టం జరిగినట్లు సమాచారం.
అధికారిక నష్టం
అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం అమరాపురం, అగళి మండలాల పరిధిలో 10 హెక్టార్లు ఆకుతోటలు, 10 హెక్టార్లు వక్కతోటలు, రొద్దం మండలంలో 20 హెక్టార్లు మామిడి, అరటి, సపోటా, టమోటా పంటలు 10 హెక్టార్లలో దెబ్బతినగా... 72 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. అందులో గుమ్మగట్ట మండలంలో 20 హెక్టార్లలో వరి, 30 హెక్టార్లలో ప్రత్తి, కళ్యాణదుర్గం మండలంలో 10 హెక్టార్లలో వరి, కంబదూరు మండలంలో 7 హెక్టార్లలో వరి, పరిగి మండలంలో రెండు హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో నష్టం అంచనా వేస్తామన్నారు.
గుమ్మగట్ట 52.50 మి.మీ వర్షం
అత్యధికంగా గుమ్మగట్ట మండలంలో 52.50 మి.మీ వర్షం కురిసింది. మడకశిర 52.18 మి.మీ, గుత్తి 46 మి.మీ, బొమ్మనహాల్ 39 మి.మీ, కళ్యాణదుర్గం 36.57 మి.మీ, రాయదుర్గం 36.12 మి.మీ,నార్పల 23.07 మి.మీ, కంబదూరు 20.70 మి.మీ, బెళుగుప్ప 20 మి.మీ, అనంతపురం 19.10 మి.మీ, ఆత్మకూరు 17.60 మి.మీ, కనగానపల్లి 17.35 మి.మీ, రొళ్ల 17.10 మి.మీ మేర వర్షపాతం నమోదైంది.
తక్కిన మండలాల్లో గాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. 11.3 మి.మీ సగటు వర్షపాతం నమోదు కాగా ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు 9.5 మి.మీ సాధారణ వర్షపాతం కాగా ఏకంగా 60.1 మి.మీ నమోదుకావడం విశేషం. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు 509 మి.మీ వర్షం పడాల్సివుండగా 31 శాతం తక్కువగా 347 మి.మీ నమోదైంది.
వర్షానికి దెబ్బతిన్న సాంకేతిక వ్యవస్థ
గుంతకల్లు: గురువారం అర్ధరాత్రి కురిసిన ఈదురుగాలులు, వర్షానికి రైల్వేలో సాంకేతిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని సిగ్నలింగ్ వ్యవస్థ పాడైంది. గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని గుంతకల్లు-వాడి సెక్షన్‌లోని మొలగవల్లి, ఆస్పరి రైల్వేస్టేషన్లలో సిగ్నలింగ్ వ్యవస్థ భారీ వర్షానికి స్తంభించింది. దీంతో ఈ మార్గంలో వెళ్తున్న మైసూర్-బాగల్‌కోట (రైలు నం-17307) ఎక్స్‌ప్రెస్ రైలు మొలగవల్లి రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి 12.14 గం.ల నుంచి 02.30 గంటల వరకు నిలిచిపోయింది.
అదేవిధంగా ఆస్పరి రైల్వేస్టేషన్ వద్ద యశ్వంతపూర్-సోలాపూర్ (రైలు నం-22134) సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. సిగ్నలింగ్ వ్యవస్థ గంటల తరబడి మొరాయించడంతో అధికారులు పేపర్ లైన్ క్లియర్ ద్వారా రైళ్లను ముందుకు కదిలించారు. అదేవిధంగా పలు రైల్వేస్టేషన్లలో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. డివిజన్‌లోని కృష్ణ, లింగేరి, మంత్రాలయం, బేవినహాల్, బంటనహాల్, కొండాపురం, జంగాలపల్లి రైల్వేస్టేషన్లలో రాత్రి 09.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అకాల వర్షం.. అనంత నష్టం
Published Sat, Apr 25 2015 3:52 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM
Advertisement