
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం
ఈశాన్య రుతుపవనాల ప్రభావం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రభావం కలగలిసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సహా తీరప్రాంత జిల్లాలు, తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్లో గోడలు కూలిన సంఘటనలు రెండు చోట్ల చోటుచేసుకున్నాయి. ట్రాఫిక్కు పలుచోట్ల అంతరాయం కలుగుతోంది. వనస్థలిపురం ఆటోనగర్ ప్రాంతంలో గోడకూలి ఇద్దరికి గాయాలయ్యాయి.
ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు అన్ని మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరిపంట చేతికి అందివస్తున్న తరుణంలో కురిసిన వర్షాల వల్ల రైతన్న నిండా మునిగిపోయాడు.
ప్రకాశం జిల్లాలో బుధవారం ఒక్కరోజే ఏకంగా 34 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక గుంటూరు జిల్లా బాపట్ల మండలం గిల్లెలమోడిలో నల్లమల డ్రైన్‌కు గండి పడి, గ్రామంలోకి భారీగా వరదనీరు వచ్చింది. దీంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 22 పునారావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,500మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నరసరావుపేటలో ఒక బస్సు వాగులో చిక్కుకుపోయింది. బస్సు దాదాపు పైభాగం వరకు కూడా నీళ్లు రావడంతో అందులోని కొందరు ప్రయాణికులు బస్సు టాప్ మీదకు ఎక్కి నిలబడ్డారు. ఎట్టకేలకు అధికారులు వారిని రక్షించగలిగారు.
నల్లగొండ జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. గోనగోయినపల్లిలోని డిండివాగు పొంగి ప్రవహిస్తోంది. వాగులో నలుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. తమను రక్షించాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా వర్షం భారీగా కురవడంతో పలుచోట్ల మార్కెట్ యార్డుల్లోకి నీళ్లు చేరుకున్నాయి. యార్డుల్లో నిల్వచేసిన ధాన్యం, మిర్చి, పత్తి పంటలు నీట మునిగాయి.