విశాఖపై తుపాన్ ప్రభావం తీవ్రం
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాన్ విశాఖపట్నం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో విశాఖ నగరం చిగురుటాకులా వణికిపోతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. నగరంలో కొన్ని భవానాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. మొబైల్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. విశాఖలో విద్యుత్ సరఫరాను ఆపివేశారు. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
నగరంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తుపాన్ తీరం దాటే సమయంలో ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. షీలా నగర్లో విజయ్ కృష్ణా నర్సింగ్ హాస్టల్ నాలుగో అంతస్తు కూలిపోయింది. శిథిలాలు మూడో అంతస్తులో పడ్డాయి. ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. తుపాన్ ప్రభావంతో జిల్లాలో ఇద్దరు మరణించారు.