తీరాన్ని తాకిన హుదూద్ తుపాన్
హైదరాబాద్: హుదూద్ పెను తుపాన్ విశాఖపట్నం జిల్లా కైలాసగిరి వద్ద తీరాన్ని తాకింది. తుపాన్ ఉత్తర దిశగా కదులుతోంది. తీరం వెంబడి గంటకు 120 నుంచి 14౦ కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాన్ ప్రభావం విశాఖపట్నంపై తీవ్రంగా ఉంది. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో విశాఖ నగరం చిగురుటాకులా ఒణికిపోతోంది. షీలా నగర్లో విజయ్ కృష్ణా నర్సింగ్ హాస్టల్ నాలుగో అంతస్తు కూలిపోయింది. శిథిలాలు మూడో అంతస్తులో పడ్డాయి. ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను చేపడుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో్ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపో్యాయి.