తిరుమల కొండ ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. గదులు, లాకర్లు, తలనీలాలు, దర్శనం, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం.. ఇలా అన్ని చోట్లా భక్తులు బారులు తీరిన క్యూలైన్లలో నిరీక్షించారు.
- సర్వదర్శనం 13 గంటలు, కాలిబాట దర్శనానికి 8 గంటలు
- టీటీడీ ఈవో, జేఈవోల నిరంతర పర్యవేక్షణ
తిరుమల : తిరుమల కొండ ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. గదులు, లాకర్లు, తలనీలాలు, దర్శనం, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం.. ఇలా అన్ని చోట్లా భక్తులు బారులు తీరిన క్యూలైన్లలో నిరీక్షించారు. సాయంత్రం 6 గంటల వరకు సుమారు 65 వేల మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి కంపార్ట్‌మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 13 గంటలు, కాలినడకన వచ్చిన యాత్రికులకు 8 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. గదులు ఖాళీ లేవు.
రిసెప్షన్ కేంద్రాల్లో ఖాళీ అయిన గదులను వెనువెంటనే భక్తులకు కేటాయించారు. యాత్రిసదన్లలో లాకర్ల కోసం క్యూ కట్టారు. తలనీలాలు సమర్పించేందుకు ప్రధాన కల్యాణకట్ట , మినీ కల్యాణకట్టల వద్ద భక్తుల నిరీక్షణ తప్పలేదు. ఇక పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాల కల్పనపై టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు క్యూలైన్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, ఆలయం, లగేజి కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. దీనివల్ల దర్శన క్యూలైన్లు వేగంగా కదిలింది. భక్తులు వేచి ఉండే సమయం తగ్గింది.