
వీఐపీలకు టిక్కెట్లు.. భక్తులకు ఇక్కట్లు
భక్తుల నిరసనలతో హోరెత్తిన తిరుమల
ఏకధాటిగా ఏడు గంటలపాటు సాగిన వీఐపీ దర్శనం
ఇష్టానుసారం రూ. 300 టికెట్లు కేటాయింపు
చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించిన భక్తులు
తమకు కూడా టికెట్లు కేటాయించాలని ధర్నా
టికెట్లు అమ్ముకుని ఉంటే విచారణ చేయిస్తాం: మంత్రి సీఆర్
అధికార యంత్రాంగాన్ని ప్రశంసించిన టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుమల: గోవింద నామంతో మార్మోగాల్సిన తిరుమలగిరి శనివారం భక్తుల ధర్నాలు, ఆందోళనలు, నినాదాలతో హోరెత్తింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పోటెత్తిన భక్తులకు దర్శనం కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రంగా విఫలమైంది. సామాన్య భక్తులను గాలికి వదిలేసి వీఐపీలకు ఎర్రతివాచీలు పరిచింది. తామంతా శుక్రవారం మధ్యాహ్నం నుంచీ క్యూలో నిరీక్షిస్తున్నా పట్టించుకోకుండా వీఐపీలకు మాత్రం అరగంటలోపే దర్శనం కల్పిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రముఖుల పేరుతో వీఐపీ టికెట్లు నల్లబజారులో విక్రయించారని ఆరోపించారు. అయినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా చైర్మన్ కార్యాలయం నుంచి రూ.300 టికెట్లు అప్పటికప్పుడే ఇష్టానుసారంగా కేటాయించారు. తమవారిని సుపథంనుంచి ఆలయానికి అనుమతించారు. దీంతో భక్తులు ఆగ్రహంతో చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించారు. టీటీడీ చైర్మన్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమకు కూడా రూ.300 టికెట్లు కేటాయించాలంటూ గంటపాటు ధర్నా చేశారు.
ఏడుగంటలపాటు వీఐపీలకే దర్శనం: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం ఓ కేంద్రమంత్రి, 11మంది రాష్ట్ర మంత్రులు, సుమారు వందమంది వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాగా, ఇంతకంటే రెట్టింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు తరలివచ్చారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల హైకోర్టులకు చెందిన 14 మంది న్యాయమూర్తులూ వచ్చారు. వీరిలో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పార్థసారథి, ప్రసాదరావు, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, కొండ్రు మురళి, డొక్కా మాణిక్య వరప్రసాద్, పితాని సత్యనారాయణ, దానం నాగేందర్, సునీత ల కా్ష్మరెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్, తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ, కార్పొరేట్ ఒత్తిళ్లకు తలొగ్గిన టీటీడీ సిబ్బంది సుమారు ఎనిమిదివేల వీఐపీ టికెట్లను జారీ చేశారు. ఫలితంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రారంభమైన రూ.1000 టికెట్ల వీఐపీ దర్శనం ఉదయం 6.54 గంటల వరకు సాగింది. కాలిబాటల్లో నడిచివచ్చి శుక్రవారం నుంచి క్యూలో వేచిఉన్న దివ్యదర్శనం టికెట్ల భక్తులను, క్యూలో వేచి ఉన్న సర్వదర్శనం భక్తులనూ ఆ తర్వాత దర్శనానికి అనుమతించారు. వారితోపాటు మరొక క్యూలో టీటీడీ ఉద్యోగులను, ముందుగా రిజర్వు చేసుకున్న రూ.300 టికెట్ల భక్తులను కూడా అనుమతించారు. దీంతో క్యూల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గతంలో నాలుగు గంటలకు పరిమితమైన వీఐపీ దర్శనం ఏకంగా ఏడుగంటలు సాగడం ఇదే తొలిసారి. దీంతో ధనుర్మాస చలిలో వేచి ఉన్న భక్తులు నానా కష్టాలు పడ్డారు. రాత్రి క్యూలలో కనీస సదుపాయాలు కూడా కరువై, ఉదయం ముఖం కడుక్కోవడానికి నీళ్లు కూడా దొరక్క నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంటిపిల్లలు, వృద్ధుల కష్టాలు చెప్పనలివికాదు. దీంతో భక్తులు, సిబ్బంది మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగి తీవ్ర స్థాయిలో గందరగోళం ఏర్పడింది.
7,958 వీఐపీ టికెట్లు మాత్రమే ఇచ్చాం: జేఈవో
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 7,958 వీఐపీ టికెట్లు మాత్రమే ఇచ్చామని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఏకాదశి కోసం మొత్తం 25వేలు, ద్వాదశి దర్శనం కోసం 15వేల టికెట్లు ఇచ్చామన్నారు. ఆలయంలో స్థలాభావం, సమయాభావం వల్ల శ్రీవారి దర్శన విషయంలో అందరనీ సంతృప్తి పరచలేమని చెప్పారు. ఏకాదశి దర్శనం అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేసిందని చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ కితాబిచ్చారు. ఏకాదశి దర్శనం కోసం టికెట్లను అమ్మినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తామని దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య చెప్పారు. దర్శనం లభించనివారికి కోపం రావడం, ఆరోపణలు చేయడం సహజమేననన్నారు. టీటీడీ అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని ఆయన ప్రశంసించారు.
కాలిబాట భక్తులకు ఉచిత లడ్డూ పంపిణీ
శ్రీవారి దర్శనానికి కాలిబాటల్లో నడిచివచ్చే భక్తులకు ఉచిత లడ్డూ పంపిణీని టీటీడీ శనివారం ప్రారంభించింది. ఏకాదశి దర్శనం కోసం వచ్చిన 25వేల మంది వరకు అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో దివ్యదర్శనం టికెట్లు ఇవ్వగా... తొలి రోజు సుమారు 10వేల మంది భక్తులు ఉచిత లడ్డూను అందుకున్నారు. అలాగే కాలిబాటల్లో నడిచి వచ్చే భక్తులకు సర్వదర్శనం భక్తులతో సమానంగా రూ.10 చొప్పున రూ.20 చెల్లించి రెండు సబ్సిడీ లడ్డూలు కూడా పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.
స్వర్ణరథంపై వైకుంఠనాథుని విహారం
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం స్వర్ణ రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమలేశుడు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 9 గంటల నుంచి 11 వరకు స్వర్ణ రథోత్సవం జరిగింది. అశేష భక్త జనం గోవిందా.. గోవిందా.. అంటూ స్వర్ణ రథాన్ని భక్తి ప్రపత్తులతో లాగుతూ తన్మయత్వం చెందారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ పాల్గొన్నారు.