
శైవక్షేత్రాల వద్ద భారీ బందోబస్తు
కోటప్పకొండపైకి వీవీఐపీ వాహనాలు మాత్రమే అనుమతి
వీఐపీలకు 15 ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు
ఏలూరు, గుంటూరు రేంజ్‌ల నుంచి భారీగా పోలీస్ బలగాలు
సాక్షి, గుంటూరు : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాలుగా పేరొందిన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి, అమరావతి అమరేశ్వరస్వామి దేవస్థానాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోటప్పకొండ తిరునాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి నాలుగేళ్ళుగా నిధులు కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఎవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకన్నారు. సోమవారం సాయంత్రం అధికారులు, సిబ్బందికి విధులను కేటాయించారు. నరసరావుపేట, చిలకలూరిపేట రోడ్ల గుండా కోటప్పకొండకు ప్రభలు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. మెట్లమార్గంలో భక్తుల భద్రతకు ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. కోటప్పకొండలో ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 100 మంది సీఐలు, 200 మంది ఎస్సైలు, 300 మంది ఏఎస్సై, హెచ్‌సీలు, 1500 మంది కానిస్టేబుళ్ళు, 300 మంది ఏఆర్ కానిస్టేబుళ్ళు, 200 మంది ఏఎన్‌ఎస్ టీమ్, 800 మంది హోంగార్డులు, 10 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్‌లు, వీరుకాక మఫ్టీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, క్రైం పోలీసులు, ఆర్మ్‌డ్‌ఫోర్స్, బీడీ టీమ్‌లు ఏర్పాటు చేశారు. వీరందరినీ సమస్వయ పరిచేందుకు కంట్రోల్‌రూమ్‌ను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు.
కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం
కొండపైకి గతంలో మాదిరిగా ప్రైవేటు వాహనాలను అనుమతించకుండా నిషేధించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారుల వాహనాలకు మాత్రం వీవీఐపీ పాస్‌ల ద్వారా కొండపైకి అనుమతిస్తారు. వీఐపీ పాస్‌లున్న వాహనాలు సైతం కొండకింద టోల్‌ప్లాజా వరకు అనుమతిస్తారు. అయితే వీరికి 15 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి కొండపైకి, కిందికి ఉచితంగా చేర్చేలా ఏర్పాట్లు చేశారు.
శివరాత్రికి దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
అరండల్‌పేట(గుంటూరు) : శివరాత్రి సందర్భంగా దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా కోటప్పకొండ ఆలయం చీఫ్ ఫెస్టివల్ అధికారి(సీఎఫ్‌ఓ)గా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.వి.సురేష్‌బాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అమరావతి దేవాలయం ప్రత్యేక అధికారిగా సింగరకొండ ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.రమణమ్మను, గోవాడకు జేఈఓ ధనలక్ష్మిలను ప్రత్యేకాధికారులుగా నియమించారు.
కోటప్పకొండలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని దేవాదాయశాఖలో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్‌పై అక్కడ నియమించారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.బి.శ్రీనివాస్ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆలయాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అర్చకులకు తగిన ఆదేశాలు జారీచేశామన్నారు. అమరావతి, గోవాడ, కోటప్పకొండలకు అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని విభాగాల అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. సారించరనేది వీరి ఆలోచన.