చిత్తూరు తాగునీటి పథకం నోట్‌పై హైకోర్టు సందేహం
అఫిడవిట్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో తాగునీటి పథకం పనులకు పరిపాలనాపరమైన అనుమతులను మంజూ రు చేస్తూ ఇచ్చిన కేబినెట్ నోట్‌పై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. అసలు నోట్ ఇదేనో, కాదో... అందులోని వివరాలు వాస్తవమైనవో, కావో చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశంతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో రూ. 7,390 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకంలో భాగంగా రూ. 4,300 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేశారని, దీనికి కేబినెట్ ఆమోదం లేదని పేర్కొంటూ టీఆర్‌ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం దానిని మరోసారి విచారించింది. గత విచారణ సమయంలో... పరిపాలనాపరమైన అనుమతులకు సంబంధించిన కేబినెట్ ప్రొసీడింగ్స్‌ను, రికార్డులను తమ ముందుంచాని ధర్మాసనం ఆదేశించింది. ఈమేరకు మౌలిక సదుపాయాల కల్పన శాఖ అధికారులు గురువారం కోర్టు ముందు హాజరై ఓ సీల్డ్ కవర్‌ను ధర్మాసనం ముందుంచారు. ఈ కవర్‌ను తెరిచిన ధర్మాసనానికి అందులో గులాబీ రంగులో ఒక కాగితం మాత్రమే కనిపించింది. ఇది కేబినెట్ నోటేనా? అని సందేహం వ్యక్తం చేసింది. కేబినెట్ నోట్ ఇదే అయితే ముఖ్యమంత్రి సంతకం లేదేమని సంయుక్త కార్యదర్శిని ప్రశ్నించింది. ఆయన కూడా ఆ కేబినెట్ నోట్ ఇదేనని చెప్పారు. అయితే కేబినెట్ నోట్ ఇదేనో.. కాదో, ఇందులోని వివరాలు వాస్తవమైనవో, కావో పేర్కొంటూ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నోట్ విషయంలో భిన్నంగా ఏవైనా చెబితే, మీపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తామని సంయుక్త కార్యదర్శిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.