
శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సాక్షి, తిరుమల: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ఆదివారం కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని అనంతరం వేంకటేశ్వరస్వామిని, వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం గుప్తా కుటుంబ సభ్యులతో కలసి తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.
మరో ఇద్దరు న్యాయమూర్తులు కూడా: అలాగే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.కాంతారావు, జస్టిస్ రవికుమార్ కుటుంబ సభ్యులతో కలసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాగా, తిరుమల ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామున మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం 44,344 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.