సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తు చేపట్టే విషయంలో ఓ అభిప్రాయానికి రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. వివిధ పరిస్థితుల్లో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలన్న విధివిధానాలు ఎన్‌ఐఏ చట్టంలోని సెక్షన్ 6లో స్పష్టంగా ఉన్నాయని, దీనిప్రకారం ఓ అభిప్రాయానికి వచ్చి, అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఏ నిర్ణయం తీసుకున్నారో తమకు తెలియచేయాలని సూచించింది. తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయవద్దని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఆదేశిస్తూ గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తనపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రతా చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచనం పరిధిలోకి వస్తుందని.. ఈ నిర్వచనం పరిధిలోకి వచ్చే ఘటనలపై దర్యాప్తు చేయాల్సింది జాతీయ దర్యాప్తు సంస్థ అని, ఆ మేరకు కేంద్ర హోంశాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై స్వతంత్ర సంస్థ దర్యాప్తుతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
గత విచారణ సమయంలో ధర్మాసనం ఆదేశాల మేరకు ఎన్‌ఐఏ దర్యాప్తుపై కేంద్రం నిర్ణయాన్ని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) కె.లక్ష్మణ్ సీల్డ్ కవర్‌లో కోర్టు ముందుంచారు. ధర్మాసనం దాన్ని తిరిగి సీల్డ్ కవర్‌లో ఉంచి, సీల్ చేసింది. ఆ నివేదికలో ఏముందో బహిర్గతం చేయలేదు. ఆ వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తూ, కేంద్ర హోంశాఖ రహస్య ఈ నివేదికను తిరిగి ఆ శాఖకే ఇచ్చేస్తున్నట్లు తెలిపింది.
శ్రీనివాసరావుకు మరో 14 రోజుల రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ విశాఖ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో అక్టోబర్ 25న జరిగిన హత్యాయత్నం కేసులో అరెస్టయిన శ్రీనివాసరావు రిమాండ్ గడువు శుక్రవారంతో ముగిసింది. గడచిన మూడు దఫాలుగా కస్టడీ ముగిసిన ప్రతిసారి సెంట్రల్ జైలు నుంచి నిందితుడ్ని ప్రత్యేక బందోబస్తుతో జిల్లా కోర్టుకు తీసుకురావడం.. మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగానే పది నిముషాల్లో రిమాండ్ పొడిగింపు ఆదేశాలు రాగానే తిరిగి మళ్లీ బందోబస్తు మధ్య సెంట్రల్ జైలుకు తరలించే వారు.
మూడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా అమలు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిమాండ్ నిందితుల హాజరు విధానానికి మళ్లీ శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టారు. రిమాండ్ ముగిసిన జనుపల్లి శ్రీనివాసరావును సెంట్రల్ జైలులోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచే నేరుగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఆ వెంటనే మేజిస్ట్రేట్ నిందితుడి రిమాండ్ గడువును మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు నిందితుడి తరఫు లాయర్ సలీం జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ నెల 27న విచారణకు రానుందని ఆయన మీడియాకు తెలిపారు. కాగా ఎప్పటిలాగే ఈసారి కూడా నిందితుడ్ని కోర్టుకు తీసుకొస్తారన్న ఆలోచనతో మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో జిల్లా కోర్టుకు చేరుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూశారు.
జగన్‌పై హత్యాయత్నం.. దర్యాప్తుపై ఓ అభిప్రాయానికి రండి
Published Sat, Dec 22 2018 4:19 AM | Last Updated on Sat, Dec 22 2018 2:05 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment