వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు.. ఎన్‌ఐఏకు అప్పగింత | Murder Attempt On YS Jagan Case Handed Over To NIA By Central Government | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు.. ఎన్‌ఐఏకు అప్పగింత

Published Sat, Jan 5 2019 1:28 AM | Last Updated on Sat, Jan 5 2019 7:40 AM

Murder Attempt On YS Jagan Case Handed Over To NIA By Central Government - Sakshi

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పటి చిత్రం

సాక్షి, అమరావతి: విశాఖపట్నం విమానా శ్రయంలో గత ఏడాది అక్టోబర్‌ 25న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఈనెల 1వతేదీన ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేసింది. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) కె.లక్ష్మణ్‌ శుక్రవారం  ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన హైకోర్టు.. పిటిషనర్లు కోరిన విధంగా కేంద్రం ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై ఇక విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది.

కేంద్రం సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.వి.భట్, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఎన్‌ఐఏ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నేపథ్యంలో జగన్‌పై హత్యాయత్నం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన దర్యాప్తును నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో కేసు డాక్యుమెంట్లను, రికార్డులన్నింటినీ చట్ట నిబంధనల మేరకు ఎన్‌ఐఏకు అప్పగించాల్సి ఉంటుంది. 

వైఎస్‌ జగన్‌ తదితరుల అభ్యర్థనలివీ...
తనపై జరిగిన హత్యాయత్నం ఘటన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ నిర్వచన పరిధిలోకే వస్తుందని, పౌర విమానయాన భద్రతా చట్ట నిబంధ నల ప్రకారం ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేసే అధికార పరిధి ఎన్‌ఐఏకు ఉందని, అందువల్ల సమగ్ర దర్యాప్తు జరిపేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ వైఎస్‌ జగన్‌ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం ఇదే అభ్యర్థనతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును పక్కదారి పట్టించేలా అటు ముఖ్యమంత్రి, ఇటు డీజీపీ ఇద్దరూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశించాలంటూ వైఎస్సార్‌ సీపీ తరఫున పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఉమ్మడి హైకోర్టు ఆదేశమిదీ...
ఈ వ్యాజ్యాలన్నింటిపై ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పౌర విమానయాన భద్రతా చట్టం, ఎన్‌ఐఏ చట్ట నిబంధనలను పరిశీలించిన ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం..
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనఎన్‌ఐఏ చట్టంలో పేర్కొన్న నేరాల కిందకు వస్తుందో రాదో వెల్లడించాలని డిసెంబర్‌ 14న కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో కేంద్ర ప్రభుత్వమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో నిర్ణయం తీసుకుంటే ఆ వివరాలను తమ ముందుంచాలంటూ తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేయడం తెలిసిందే. 

విభజనతో ఏపీకి బదిలీ అయిన వ్యాజ్యాలు..
ఈలోపు ఉమ్మడి హైకోర్టు విభజన జరగడంతో ఈ వ్యాజ్యాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. శుక్రవారం వీటిపై జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏఎస్‌జీ లక్ష్మణ్‌ వాదనలు వినిపిస్తూ వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం ఘటనపై దర్యాప్తు జరపాలని ఎన్‌ఐఏను ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ డిసెంబర్‌ 31న ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వీటి ఆధారంగా ఎన్‌ఐఏ జనవరి 1వతేదీన ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేసిందని చెప్పారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు, ఎన్‌ఐఏ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆయన ధర్మాసనం ముందుంచారు. 

కేంద్రం అధికార పరిధి దాటి ఉత్తర్వులిచ్చింది...
ఈ సమయంలో రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తన అధికార పరిధిని దాటి ఈ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వును సవాలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... ‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాలు చేసే విషయంలో ఉన్న హక్కులను ఉపయోగించుకోవాలా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. ఈ వ్యాజ్యాలన్నింటిలో ప్రధాన అభ్యర్థన దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగించాలనే. ఇప్పుడు కేంద్రం ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. కేంద్రం ఉత్తర్వుల మేరకు ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేసింది. కాబట్టి ఈ వ్యాజ్యాల్లో ఇకపై విచారించేందుకు ఏమీ ఉండదు. అందువల్ల వాటిని మూసేస్తున్నాం’ అని స్పష్టం చేసింది. 

సెక్షన్‌ 6లో స్పష్టంగా ఉంది.. 
ఈ సమయంలో వైఎస్‌ జగన్‌ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్‌ స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో ఇకపై దర్యాప్తు చేయకుండా స్థానిక పోలీసులను నియంత్రిస్తూ, ఎన్‌ఐఏకి దర్యాప్తును అప్పగించేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం బదులిస్తూ.. ఎన్‌ఐఏ చట్టం సెక్షన్‌ 6ని ఒకసారి చదవాలని నవీన్‌కు సూచించింది. ఈ సెక్షన్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ పోలీసు అధికారి కూడా దర్యాప్తు విషయంలో ముందుకెళ్లడానికి వీల్లేదని, వెంటనే కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డులను ఎన్‌ఐఏకు అప్పగించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఈ విషయంలో తమ నుంచి తదుపరి ఆదేశాలు అవసరం లేదని పేర్కొంది. 

ఉత్తర్వుల్లో అన్ని విషయాలను ప్రస్తావించిన ధర్మాసనం...
ఆ వెంటనే హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులను వెలువరిస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలు, అందుకు అనుగుణంగా ఎన్‌ఐఏ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ గురించి ప్రస్తావించింది. కేంద్రం ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. అంతేకాకుండా అడ్వకేట్‌ జనరల్‌ చెప్పిన విషయాలు, జగన్‌ తరపు న్యాయవాది నవీన్‌ ప్రస్తావించిన అంశాలను కూడా అందులో పొందుపరిచింది. పిటిషనర్ల అభ్యర్థన మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణ అవసరం లేదని, అందువల్ల వాటిని మూసివేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

శిక్షార్హమైన నేరమే 

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ పరిధిలోని కౌంటర్‌ టెర్రరిజం అండ్‌ కౌంటర్‌ రాడికలైజేషన్‌ డివిజన్‌ (సీటీసీఆర్‌) డిసెంబరు 31న ఉత్తర్వులు జారీ చేసింది. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనకు సంబంధించి విశాఖ ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో గత ఏడాది అక్టోబర్‌ 25వ తేదీన ఐపీసీ 307 సెక్షన్‌ కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.

ఈ ఘటన పౌర విమానయాన చట్టం 1982 సెక్షన్‌ 3 ఏ (1)(ఏ) ప్రకారం శిక్షార్హమైన నేరం. జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008 షెడ్యూల్‌ ప్రకారం కూడా నేరమే. ఘటన తీవ్రత దృష్ట్యా దీనిపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎన్‌ఐఏ చట్టం 2008 సెక్షన్‌–6 (సెక్షన్‌–8తోపాటు చదివినప్పుడు)లోని ఉప సెక్షన్‌ (5) ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఎన్‌ఐఏను ఆదేశిస్తున్నాం’అని కేంద్ర హోంశాఖ తరపున ధర్మేందర్‌కుమార్‌ పేరుతో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

‘సెక్షన్‌ 3 ఏ (1)(ఏ) ఏం చెబుతోంది? 
సెక్షన్‌ 3 ఏ: ఎయిర్‌పోర్టు వద్ద నేరానికి పాల్పడటం. 
(1): ఎవరైనా, ఏ ఎయిర్‌ పోర్టు వద్ద అయినా చట్ట వ్యతిరేకంగా, ఉద్దేశపూర్వకంగా, ఏదైనా సాధనాన్ని, ఆయుధాన్ని, పదార్థాన్ని వినియోగించడం. 
(ఏ): హింసాత్మక చర్యకు పాల్పడడం ద్వారా తీవ్రంగా బాధించడం లేదా వ్యక్తి మృతి చెందేందుకు కారణం కావడం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement