
‘ఆధార్’తో ఇబ్బందిపెట్టొద్దు కేంద్రానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎవరో కొందరు ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో ఆధార్ ప్రాజెక్టును తీసుకువచ్చి మెజారిటీ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతమాత్రం సరికాదని కేంద్రానికి హితవు పలికింది. నగదు బదిలీకి ఆధార్‌కు లింక్ పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి అసలు దేశంలో ఎంతమందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయో తెలుసా..? అంటూ ప్రశ్నించింది.
ఆధార్ ఉంటేనే సబ్సిడీ గ్యాస్ సరఫరా చేస్తుండడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు న్యాయవాది వై.బాలాజీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. సంక్షేమ పథకాలు దుర్వినియోగం అవుతున్నందు వల్లే నగదు బదిలీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం... ఎవరో కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మెజారిటీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారా..? అంటూ ప్రశ్నించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని, ఇదే అంశంపై ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేసినందున ఈ పిటిషన్‌పై ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది.