రెవెన్యూ శాఖలో పైరవీల జాతర
Published Fri, Oct 11 2013 1:00 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా రెవెన్యూ శాఖలో పైరవీల జాతర జోరుగా సాగుతోంది. ఇటీవల కొత్త రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆశావహులంతా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ కార్యాలయాల్లో ఇప్పటివరకు ఆర్డీఓ పోస్టులు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. మిగిలిన కింది స్థాయి పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో కొత్త కార్యాలయాల్లో కుర్చీ దక్కించుకునేందుకు కొందరు ఉద్యోగులు పావులు కదుపుతున్నారు. ఉన్నతస్థాయిలో మంత్రాంగం నెరిపి సీటు దక్కించుకునేందుకు అడుగులు వేస్తున్నారు. తమ వాస్తవ పోస్టింగ్‌లను సైతం మార్పు చేసుకుని అనుకున్న స్థానంలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో పాలనాధికారి(ఏఓ)గా ఓ ఉద్యోగిని నియమించారు. అయితే వారం గడవక ముందే ఈ పోస్టులో మరో వ్యక్తిని నియమిస్తూ ఉత్తర్వులు తెచ్చుకోవడం తాజా పైరవీల పరిస్థితిని స్పష్టం చేస్తోంది.
కొత్తవారికి కొలువులు
జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పాలనా సౌలభ్యం నిమిత్తం జిల్లా యంత్రాంగం కొందరు ఉద్యోగులను బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్ బి.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక్కో కార్యాలయానికి ఇద్దరేసి ఉప తహసీల్దార్లు బదిలీ అయ్యారు. అదేవిధంగా మరో ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఆయా కార్యాలయాల్లో కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. వీరితోపాటు మరో నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బదిలీ అయ్యారు. కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వడంతో వారంతా విధుల్లో చేరాల్సి ఉంది.
మేం వెళ్లం..!
కొత్త కార్యాలయాల్లో పోస్టింగ్ ఇచ్చినప్పటికీ పలువురు ఉద్యోగులు గురువారం విధుల్లో చేరలేదు. ప్రస్తుతం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలోని సిబ్బంది రాజేంద్రనగర్ డివిజన్ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే ఉద్యోగులను చేవెళ్ల కార్యాలయానికి బదిలీ చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. ఇందులో భాగంగా తమను రాజేంద్రనగర్ కార్యాలయానికి పరిమితం చేయాలంటూ ఉన్నతాధికారుల వద్ద పైరవీలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కలెక్టరేట్‌తోపాటు సీసీఎల్‌ఏ కార్యాలయంలోని పలువురు ఉన్నతాధికారులను కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా పోస్టింగులు తీసుకున్న ఉద్యోగులు కొంత గందరగోళంలో పడ్డారు. మరోవైపు తమకిచ్చిన ఉత్తర్వుల ప్రకారం విధుల్లో చేరుతామని పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement