తెలంగాణ నోట్ కథనాలపై సీమాంధ్ర భగ్గుమంది. దాంతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నివాసాలపై సమైక్యవాదులు దాడులు చేయవచ్చనే అనుమానాలతో వారి నివాసాల వద్ద భద్రత పెంచారు
తెలంగాణ నోట్ కథనాలపై సీమాంధ్ర భగ్గుమంది. దాంతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నివాసాలపై సమైక్యవాదులు దాడులు చేయవచ్చనే అనుమానాలతో వారి నివాసాల వద్ద భద్రత పెంచారు. తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధం అయిందన్న వార్తల నేపథ్యంలో సమైక్యవాదులు నిరసనలు, ఆందోళనలు ఉధృతం చేశారు. ఈరోజు ఉదయం గుంటూరు, విశాఖలో విగ్రహాలను ధ్వంసం చేశారు.
అనంతపురం, కడప, ఉభయ గోదావరి జిల్లాలో దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మంత్రులు, కేంద్రమంత్రులు తక్షణమే పదవులకు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులకు, సమైక్యవాదులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగటంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో విజయనగరం జిల్లా బంద్కు పిలుపు నిచ్చారు.
ఇక కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్, బొత్స ఝాన్సీ నివాసాలను సమైక్యవాదులు ముట్టడించారు. ఇక అనంతపురం జిల్లాలో పలుచోట్ల ఆకస్మిక బంద్కు పిలుపు నిచ్చారు. ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నివాసాన్ని విద్యార్థులు, సమైక్యవాదులు ముట్టడించారు.