సాక్షి, తాడిపత్రి: సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎంతో ఉత్కంఠగా సాగాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతలు పూర్తయిన తరువాతనే ఫలితాలు విడుదల కానున్నాయి. చివరి విడతగా ఆదివారం ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈనేపథ్యంలో అభ్యర్థులు సుదీర్ఘ కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో వారిలో ఆందోళన ఎక్కువ అవుతోంది. కౌటింగ్ సమయానికి ఇక రెండు రోజులే ఉండడంతో ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈవీఎంలలో తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మార్చి 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 25 వరకు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన పార్టీలు వైఎస్సార్‌సీపీ, టీడీపీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. వైఎస్సార్‌సీపీ నుంచి గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ, అధ్యక్షుడు వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి, టిడిపి నుండి చంద్రబాబునాయుడులు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో జిల్లా వ్యాప్తంగా 81.09శాతం ఓటింగ్ నమోదైంది.
నిద్ర కరువు
ఫలితాల కోసం 40 రోజులకు పైగా వేచి చూడాల్సి రావడంతో అభ్యర్థులకే కాదు వారి అనుచరులకూ నిద్ర కరువైంది. ఓటరు తీర్పు ఎలా ఉంటుందో అని తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. కనీసం ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడకూడదని నిబంధనలు ఉండడంతో ఫలితాలు ఎలా ఉంటాయో అని తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. పార్టీపరంగా చూస్తే తమ కార్యకర్తలతో అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడ ఓట్లు పడ్డాయే...ఎక్కడ పడలేదో లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల నుంచి అభ్యర్థులు ఒక్కొక్కరూ ఒక్కో రకం ఫలితాలు చెబుతున్నారు. దీంతో అభ్యర్థుల ఆందోళన మరింత పెరుగుతోంది.
సర్వేల మీద సర్వేలు
పోలింగ్ సరళిని గమనించిన తర్వాత ఓటమి తప్పదని టిడిపి నాయకులు అంచనా వేసుకుంటున్నారు. అయినా ఎక్కడో ఆశ మెదలుతోంది. దీంతో బూత్‌ల వారిగా ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఫోన్లు, ఇంటింటి సర్వేలు చేయించుకుంటున్నారు. తాడిపత్రిలో ఈసారి ఓటమి తప్పదనే వార్తలు వినిపిస్తుండంతో ఇప్పటికే మూడు సార్లు సర్వే నిర్వహించారు. ఎవరికి ఓటేశారు?ఎందుకు వేశారు? అంటూ నియోజకవర్గంలోని ప్రజలకు ఫోన్లు చేస్తున్నారు. రోజుకు కనీసం మూడుమార్లు ఫోన్లు వస్తున్నాయని కొందరు చెబుతున్నారు. పెద్దవడుగూరు, యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో తమకు ఓటేశారాని ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment