నిరుపేద హిందువుల ఆకలి తీరుద్దాం | Hindus poor | Sakshi
Sakshi News home page

నిరుపేద హిందువుల ఆకలి తీరుద్దాం

Published Sat, Dec 13 2014 2:52 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

Hindus poor

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా శుక్రవారం నంద్యాల, కర్నూలులో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజుకోసారి పిడికెడు బియ్యం, ఒక రూపాయిని సహాయంగా అందజేస్తే నిరుపేదలైన హిందువుల ఆకలి తీర్చవచ్చునని, విద్య, వైద్య, ఉపాధి సదుపాయాలను కల్పించి ఆదుకోవచ్చునని ఆయన పిలుపునిచ్చారు.     
 
 నంద్యాలటౌన్/కర్నూలు (న్యూసిటీ): రోజుకోసారి పిడికెడు బియ్యం, ఒక రూపాయిని సహాయంగా అందజేస్తే నిరుపేదలైన హిందువుల ఆకలి తీర్చవచ్చునని, విద్య, వైద్య, ఉపాధి సదుపాయాలను కల్పించి ఆదుకోవచ్చునని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి ప్రవీణ్‌తొగాడియా పిలుపునిచ్చారు. స్థానిక టెక్కె మార్కెట్ యార్డులో శుక్రవారం ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు.
 
  శతాబ్దాల క్రితం హిందువులు విశ్వ వ్యాప్తంగా ఉండేవారని, అప్పట్లోనే సంస్కృతి, సాంప్రదాయాలు ఉండేవన్నారు.  క్రమేపీ హిందువుల ప్రాబల్యం తగ్గి కేవలం భారతదేశానికే పరిమితమైందన్నారు. ప్రస్తుతం భారతదేశ యువకులు విద్యాభ్యాసానికి అమెరికాకు వెళ్తున్నారని, కాని అప్పట్లో అమెరికా వారే భారతదేశానికి వచ్చి విద్యాభ్యాసం చేసే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలకు అమెరికా కేంద్రంగా ఉందని, అప్పట్లో భారతదేశంలోని హస్తినాపురం ఉండేదన్నారు. చైతన్యం, ఐకమత్యం లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందకోట్ల మంది హిందువులను రక్షించడమే లక్ష్యంగా వీహెచ్‌పీ పని చేస్తుందని ఆయన చెప్పారు. వీహెచ్‌పీ 53 వేల గ్రామాలను దత్తత తీసుకుందని, 20 లక్షల మందికి ఫీజులు లేకుండా విద్యాభ్యాసాన్ని అందజేస్తుందని చెప్పారు. ఏ హిందువైనా హెల్ప్‌లైన్ నం. 108602333666  ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా.. తక్షణం సహాయాలను పొందవచ్చునన్నారు. ఆయా ప్రాంతంలోని వీహెచ్‌పీ కార్యకర్తలు, నేతలు అందుబాటులోకి వచ్చి సహాయాన్ని అందజేస్తామని వివరించారు.
 
 కార్యక్రమంలో వీహెచ్‌పీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు వైఎన్ రెడ్డి, గౌరవాధ్యక్షుడు ఏర్వ రామచంద్రారెడ్డి, పట్టణ గౌరవాధ్యక్షులు బాచం నాగేశ్వరరెడ్డి, పట్టణ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శి సురేంద్రారెడ్డి, స్వర్ణజయంతి కమిటీ అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, ప్రాంతీయ సంఘటన కార్యదర్శి ఆకారపు రామరాజు, మున్సిపల్ చైర్మన్ సులోచన, సాధువులు అచల పరిపూర్ణానందస్వాములు, రంగనాథస్వామి, మౌనిస్వామి, శివానందస్వామి, మధుబాబు గురుభవాని, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.  
 
 హిందూ ధర్మాన్ని పాటిద్దాం
 కర్నూలు(న్యూసిటీ): హిందూ ధర్మాన్ని పాటిస్తే పాపాలు తొలగుతాయని విశ్వహిందూ పరిషత్తు అంతర్జాతీయ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌బాయి తొగాడియా అన్నారు.  విశ్వహిందూ పరిషత్  ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కర్నూలు నగరంలోని టీజె కాంప్లెక్స్‌లో నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తమ పరిపాలన పద్ధతిని మార్చుకోవాలన్నారు. పేద విద్యార్థులు చదువుకోడానికి సాయం చేయాలన్నారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి వెంకట్రామయ్య మాట్లాడుతూ.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందువుల జెండాతో నిండిపోవాలని పేర్కొన్నారు.
 
 ముందుగా డాక్టర్ ప్రవీణ్‌బాయి తొగాడియాకు విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షుడు డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి, మంత్రాలయం సంస్కృత విద్యాపీఠం ప్రిన్సిపల్ వాదిరాజ ఆచార్ శాలువలతో సన్మానించారు. సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.  కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ప్రాణేష్, వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు కె.కిష్టన్న, ప్రాంత సంఘటన ప్రఖండ్ ఆకారం కేశవరాజు, రాయలసీమ కన్వీనర్ బాలసుబ్రమణ్యం, ప్రైవేటు విద్యా సంస్థల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు జిఎస్.నాగరాజు అనేకమంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement