భువనగిరి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న వార్తల నేపధ్యంలో జిల్లాలోని హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణలో జీవించాలన్న తమ ఆశయం నెరవేరబోతున్న సమయంలో కేంద్రం హెచ్‌ఎండీఏ పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీల సమాచారాన్ని కోరి నట్లు ప్రకటనలు రావడంతో ఈ ప్రాంత ప్రజల్లో అలజడి మొదలైంది. తాము హైదరాబాద్ రాజధానిగా కూడిన తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నామే తప్పా కేంద్ర పాలిత ప్రాంతం కాదని ప్రజలు అంటున్నారు.
ఎప్పటినుంచో తమ జీవితాల్లో భాగమైన హైదరాబాద్‌ను పరాయి పరం చేయవద్దని కోరుతున్నారు. జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్ మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఈ మండలాలన్నీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుండగా, మునుగోడు అసెంబ్లీ పరిధిలోకి చౌటుప్పల్‌లో 25, ఆలేరు పరిధిలోని బొమ్మలరామారంలో 25, భువనగిరి పరిధిలోకి పోచంపల్లిలో 21, బీబీనగర్‌లో 27, భువనగిరిలో 35 గ్రామాలు కలిపి మొత్తం 133 గ్రామాలు ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన నేపధ్యంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న సీమాంధ్ర నాయకుల డిమాండ్ల నేపధ్యంలో కేంద్రం హెచ్‌ఎం డీఏ పరిధిపై సమగ్ర రాజకీయ సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే మండలాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువెళతారేమోనని ఇక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంటే స్వయం పాలన కోల్పోయి, విధాన నిర్ణయాధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్తాయి. దీంతో తమను తాము పరిపాలించుకోకుండా పరాయి పాలనలో ఉన్నామన్న భావన వస్తుందని మేధావులు అంటున్నారు. ఇక్కడి ప్రజలు చెల్లించే పన్నులు రాష్ట్రానికి కాకుండా కేంద్రానికి వెళ్తాయని, తద్వారా అభివృద్ధిలో సమతుల్యత దెబ్బతింటుందన్న అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతుంది.
హెచ్‌ఎండీఏ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు వీరే..
భువనగిరి లోక్‌సభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, భువనగిరి ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌కు చెందిన బూడిద భిక్షమయ్యగౌడ్, మునుగోడు ఎమ్మెల్యేగా సీపీఐకి చెందిన ఉజ్జిని యాదగిరిరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.