తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదు
Published Thu, Aug 8 2013 3:18 AM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ :నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇక ఆగదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హుజూర్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాలకాలంగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న ప్రత్యేక రాష్ట్రఅంశంపై యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ.. చరిత్రలో నిలిచిపోయేవిధంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణపై ప్రకటనతో సోనియాగాంధీ.. ఇక్కడి ప్రజల హృదయాల్లో దైవం గా నిలిచిపోయారన్నారు.
నాలుగైదు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయి ప్రజల కల నెరవేరబోతుందన్నారు. సీమాంధ్ర ప్రాంతాల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకే కోర్‌కమిటీ సభ్యులు ఏకె.ఆంటోని నేతృత్వంలో కమిటీ వేశారన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, నదీజలాలు, ఉద్యోగా లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఏ ప్రాంతం వారికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంటారన్నారు. తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్న వారిని వెళ్లగొడతామని ఇటీవల ఓ పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అనవసరమన్నారు.
రాజ్యాంగానికి లోబడి, నియమావళి ప్రకారం ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారని చెప్పారు, మిగిలిన వారిని వారి సర్వీస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో ఢిల్లీ తరహాభద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి కేంద్ర హోంమంత్రి షిండే పర్యవేక్షణలో శాంతిభద్రతలను చూస్తామని ఇటీవల సీడబ్ల్యూసీ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ వెల్లడించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సీమాంధ్రలో సమైక్యాంధ్ర పేరుతో జాతీయ నాయకుల విగ్రహాలు ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు. సోనియాగాంధీ తన కుమారుడిని ప్రధానమంత్రిని చేసేందుకే రాష్ట్రాన్ని విభజించారని కొందరుచెప్పడం అనైతికమన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రకటించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నారు.
హుజూర్‌నగర్‌కు ఐటీఐ కళాశాల మంజూరు
హుజూర్‌నగర్‌కు ఐటీఐ కళాశాల మంజూరు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. రూ.6.02 కోట్లతో ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదలఅభివృద్ధి సంస్థ డెరైక్టర్ సాముల శివారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement