
హోంగార్డు.. పదానికి అర్థం ఏదైనా పోలీసు శాఖలో వీరిది కీలక పాత్ర. జీతం తక్కువైనా సేవలు మాత్రం పోలీసులతో సమానం. ఇంకా చెప్పాలంటే వారికంటే ఎక్కువే. రోజుకు వారికిచ్చే వేతనం రూ.400. అది కూడా రోజూ హాజరైతేనే. ఎనిమిది గంటలు పనిచేసే కార్మికులకు చట్టప్రకారం రూ.18వేలు ఇవ్వాలని కార్మిక శాఖ చెబుతోంది. చట్టాన్ని రక్షించే రక్షకులుగా పనిచేసే వీరి కష్టాలు వర్ణనాతీతం. పేరుకు హోంగార్డుగా పనిచేస్తున్నా హోమ్ గడవని గార్డులెందరో. హోంగార్డుల విధులు, వేతనాలు, పడే కషాలపై కథనం.
ఏళ్లుగా హోంగార్డుల డిమాండ్‌లు
⇔ ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి
⇔ బస్సులో వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి
⇔ మహిళా హోంగార్డులకు రెండు నెలల జీతంతో ప్రసూతి సెలవులు కేటాయించాలి
⇔ నెల జీతం రూ.18 వేలకు పెంచాలి
⇔ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి
⇔ విధుల్లో చనిపోయిన హోంగార్డుల వారసులకు ఉద్యోగం ఇవ్వాలి.
⇔ విధుల్లో లేదా అనారోగ్యంతో చనిపోతే రూ.2లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలి.
జిల్లాలో దాదాపు 1600 మందికి పైగా హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది ట్రాఫిక్ విధులు, సెక్యూరిటీ, పారిశుద్ధ్య పనులు, స్టేషన్ల డ్యూటీలు, పోలీసు వాహనాలకు డ్రైవర్లుగా, అధికారుల ఇళ్ల వద్ద పని చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ పని గంటల్లో పరిమితి ఉండడం లేదు. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు పోలీసులతో సమానంగా విధులు చేసి తీరాల్సిందే. పోలీసులైనా నెలలో సెలవు తీసుకునే వెలుసుబాటు ఉంటుంది. కానీ హోం గార్డులకు సెలవు అనే మాటే ఉండదు. ఉన్నతాధికారులు దయతలిస్తే తప్ప సెలవు మంజూరుకాదు. మానసికంగా, శారీరంగా పనిలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న హోంగార్డులు ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే వీరి గురించి ఆలోచించడానికి ప్రభుత్వాలు, పాలకులకు సమయం ఉండడం లేదు.
వేతనాలు అంతంతే...
పదేళ్ల సర్వీసు ఉన్న ఒక్కో కానిస్టేబుల్‌కు గరిష్ట వేతనం రూ.30 వేల వరకు అందుతోంది. కానీ 20 ఏళ్లకు పైగా సర్వీసు ఉన్న హోంగార్డులకు ఇప్పటికీ రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. రోజుకు రూ.400 వేతనానికి పనిచేస్తున్నారు. ఇంటి పనులు చేసే మేస్త్రీ కూలీకి రోజుకు రూ.550 వేతనం ఇచ్చి ఓ పూట భోజనం పెడుతున్న తరుణంలో కనీస వేతన సవరణ చట్టాన్ని హోంగార్డులకు అందడం లేదు. ఇక జిల్లాలో అగ్నిమాపక, పురాతనవస్తు శాఖల్లో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న హోం గార్డులకు ప్రతినెలా వేతనాలు సక్రమంగా అందడంలేదు. గత నాలుగు నెలలుగా వీరికి వేతనాలు రాకున్నా ఎందుకు..? ఏమయ్యింది..?అని అడిగే దిక్కు కూడా లేదు.
అమలు కాని కోర్టు ఆదేశాలు..
⇔ హోంగార్డులకు ప్రతి 26 నెలలకు ఓ సారి వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా అమలుకావడంలేదు. తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో నెలకు రూ.18 వేల వేతనం ఇస్తున్నా.. ఇక్కడ మాత్రం రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు.
⇔ విధి నిర్వహణలో, అనారోగ్యంతో చనిపోయిన హోం గార్డుల అంత్యక్రియలకు తక్షణం కుటుంబానికి రూ. 15 వేలు ఇవ్వాలని పదేళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సాటి ఉద్యోగులు చందాలు వేసుకుని ఆర్థికసాయం చేయాల్సి వస్తోంది.
⇔ హోంగార్డుల కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యం చేయించడానికి ఈఎస్‌ఐ సౌకర్యం లేదు. రీయింబర్సుమెంటు రూ.2 లక్షలు ఇవ్వాలని అడుతున్నా రూ.25 వేలు ఇస్తున్నారు.
⇔ కానిస్టేబుల్ కోటాలో ఉద్యోగాలు పొందాలనుకునే హోంగార్డులకు సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా 35 ఏళ్ల వరకు అవకాశం ఇవ్వాలని పోరాడుతున్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇంటి అద్దె, రవాణా భత్యం లాంటి వాటికి హోంగార్డులు అర్హులుకారు.
⇔ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ పేర్కొన్నా.. 2016లో తిరుపతిలో జరిగిన మహానాడులో హోంగార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు.
పోలీసులతో సమానంగా విధులు
పోలీసు శాఖలో చివరిది హోంగార్డు వ్యవస్థ. 1990లో రోజుకు రూ.50తో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాలనుగుణంగా ప్రస్తుతం రోజుకు రూ.400 చెల్లిస్తున్నారు. వీరికిచ్చే జీతం తక్కువైనప్పటికీ సేవలు మాత్రం పోలీసులతో సమానంగా ఉంటాయి. సమాజంలో ఒక కుటుంబం జీవించాలంటే నెలకు రూ. 18వేలు కావాలి. రూ.12వేల జీతంతో హోంగార్డులు జీవితాలను నెట్టుకొస్తున్నారు. హోంగార్డులంటేనే స్వచ్ఛంద సేవలు చేసేవారని, వీరికి వేతనాలకు బదులుగా గౌరవ వేతనం ఇవ్వాలని 30 ఏళ్ల కిందట ఇచ్చిన ఆదేశాలను మార్చాలని కోరుతున్నారు. తాము స్వచ్ఛంద సేవకులం కాదని.. కష్టపడి పనిచేసే ఉద్యోగులమని గొంతులు చించుకుని అరుస్తున్నా ఆ ఆకలి కేకలు ఎవరికీ వినపడడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment