
సాక్షి, అమరావతి: పల్లెలు, పట్టణాల్లో బుధవారం నుంచి ముందస్తుగా సంక్రాంతి సందడి సంతరించుకోనుంది. వైఎస్సార్ నవశకం పేరుతో అర్హులైన ప్రజలందరికీ సంక్షమ పథకాల ఫలాలు అందించేందుకు నేటి నుంచి ఇంటింటి సర్వే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది. వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ, పట్టణ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, రిసోర్స్ పర్సన్లతో పాటు మండల స్థాయి అధికారులందరూ కలిపి దాదాపు 4 లక్షల మంది ఇంటింటి సర్వేలో భాగస్వాములు కానున్నారు.
రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం నేరుగా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. గతప్రభుత్వంలో రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ కోసం ప్రజలు జన్మభూమి కార్యక్రమాల్లో అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రజలు పడిన ఆ వెతలను పాదయాత్రలో స్వయంగా చూడటమే కాకుండా అదే యాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చడమే లక్ష్యంగా సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను గుర్తించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యచరణను ప్రకటించారు.
ప్రక్రియ.. అవినీతి రహితం, పారదర్శకం
కుల, మత, ప్రాంతం, పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అవినీతి రహితంగా, పారదర్శకంగా ఈ పక్రియ సాగనుంది. పేదలకు మరింత న్యాయం చేసేందుకు వార్షిక ఆదాయ పరిమితిని భారీగా పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా వార్షిక ఆదాయ పరిమితిని పెంచడం ద్వారా మరింత మందికి సంక్షేమ, ఆరోగ్య ఫలాలు చేరవేయాలనేది సీఎం ఉద్ధేశం అని ఉన్నతాధికారులు తెలిపారు. బియ్యం కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు వైఎస్సార్ కాపు నేస్తం, మిగతా పథకాలన్నింటికీ అర్హతలు, ఎంపిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. వాటికి అనుగుణంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం వలంటీర్లకు ప్రత్యేక ప్రొఫార్మాలను అందజేయడమే కాకుండా ఇంటింటి సర్వేలో పాల్గొనే యంత్రాంగానికి మంగళవారం వరకు వివిధ స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు.
అర్హుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా జాగ్రత్తలు
గ్రామ వలంటీర్లు తమ పరిధిలో రోజుకు ఐదు ఇళ్లలో, పట్టణ ప్రాంతాల్లోని వార్డు వలంటీర్లు రోజుకు పది ఇళ్లలో మాత్రమే సర్వే నిర్వహిస్తారు. సర్వే ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుంది. అనంతరం లబ్ధిదారుల ముసాయిదా జాబితాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఆ ముసాయిదా జాబితాలపై స్థానికుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. మార్పులు, చేర్పులను ఆహ్వానిస్తారు. ఇది పూర్తి కాగానే గ్రామ, వార్డు సభలను ఏర్పాటు చేసి సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామ, వార్డు సభల్లో లబ్ధిదారుల తుది జాబితాలకు ఆమోదం పొందుతారు. ఆ తర్వాత వాటిని సచివాలయాల వద్ద బోర్డుల్లో శాశ్వతంగా ప్రదర్శిస్తారు.
సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా సచివాలయ అధికారులు, మండల, మున్సిపాలిటీల స్థాయి అధికారులకు, సంబంధిత శాఖలకు చేరవేయడమే కాకుండా వివరాలను కంప్యూటీకరించనున్నారు. అర్హులైన వారిలో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కాగా, ప్రతి పథకం అర్హతలు, మార్గదర్శకాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోని ప్రదర్శన బోర్డుల్లో ఉంచుతారు. అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్నీ ప్రదర్శిస్తారు. ఇవి సచివాలయాల్లో శాశ్వతంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment