సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటనతో జిల్లా పునర్విభజనపై చర్చ ఊపందుకుంది. విభజన ప్రతిపాదనలు పరిశీలిస్తే జిల్లా కనీసం మూడు లేదా నాలుగు జిల్లాల్లో అంతర్భాగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా విస్తీర్ణం 9,699 చదరపు కిలో మీటర్లు కాగా, రాష్ట్ర వైశాల్యంలో 3.53 శాతాన్ని ఆక్రమించి ఉంది. తెలంగాణను 17 నుంచి 24 జిల్లాలుగా విభజించే అవకాశముందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే జరిగితే మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
జిల్లాలో ప్రధానంగా రెండు డిమాండ్లపై సుదీర్ఘ కాలంగా ఉద్యమాలు సాగుతున్నాయి. సిద్దిపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనేది ప్రధాన డిమాండు. మెదక్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనేది మరో డిమాండు. సిద్దిపేట డివిజన్‌లోని 13 మండలాలతో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలోని మరో 20 మండలాలు కలుపుకుని కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ‘జిల్లాల పునర్విభజన సాధన సమితి’ డిమాండు చేస్తోంది. ఇప్పటికే పోస్టు కార్డులు, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫ్యాక్స్‌లు, మండల కేంద్రాల్లో పాదయాత్రల ద్వారా పలు రూపాల్లో ఉద్యమాలు కూడా జరిగాయి. సెప్టెంబర్ రెండో వారంలో సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండుతో మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహించేందుకు కూడా సాధన సమితి కసరత్తు చేస్తోంది. జిల్లా కేంద్రంగా మెదక్‌ను ప్రకటించాలంటూ రెండేళ్ల క్రితం రిలే దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో మెదక్ జిల్లా కేంద్ర సాధన సమితి తన కార్యకలాపాలకు విరామం ప్రకటించింది. సం గారెడ్డి కేంద్రంగా ‘మంజీర జిల్లా’ను ప్రకటించాలనే డిమాండు స్థానికంగా వినిపిస్తోంది.
దూరభారం వల్లే
సిద్దిపేట నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రం సంగారెడ్డికి రావాలంటే కనీసం 120 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో పాలన, క్షేత్రస్థాయి తనిఖీల్లో అధికార యంత్రాంగం సమస్యలు ఎదుర్కొంటోంది. మరోవైపు వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వచ్చే వారు కూడా వ్యయ, ప్రయాసలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన వెలువడటంతో కొత్త జిల్లా ఏర్పాటు ఖాయమనే భావన సిద్దిపేట ప్రాంతాల్లో బలంగా కనిపిస్తోంది. జిల్లాలో పునర్విభజనపై స్థానికంగా వివిధ వర్గాల విశ్లేషణ ప్రకారం తెరమీదకు వస్తున్న ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.
సిద్దిపేట కేంద్రంగా మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలోని 33 మండలాలతో నూతన జిల్లా ఏర్పాటు. సిద్దిపేట డివిజన్‌లోని 13, మెదక్ డివిజన్‌లోని 3 మండలాలు, కరీంనగర్‌లో 12, వరంగల్ జిల్లాలో నాలుగు, నల్గొండ జిల్లాలోని రాజాపేట మండలాన్ని సిద్దిపేట జిల్లాలో చేర్చాలి. ప్రస్తుతం సంగారెడ్డి కేంద్రంగా ఉన్న జిల్లాను మెదక్ కేంద్రంగా ప్రకటించడం. సంగారెడ్డి కేంద్రంగా సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, నర్సాపూర్, పటాన్‌చెరు, జహీరాబాద్ నియోజకవర్గాలతో కూడిన మంజీరా జిల్లా ఏర్పాటు. మెదక్ కేంద్రంగా మెదక్, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్ (నిజామాబాద్) నియోజకవర్గాలతో కూడిన మెదక్ జిల్లా. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాలో కోహీర్ మండలాన్ని చేర్చడం.
కొత్త జిల్లాపై కోటి ఆశలు
Published Fri, Aug 23 2013 2:06 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement