- డీఈఓ ఎం.వి.కృష్ణారెడ్డి
తుమ్మపాల: పదో తరగతి నూతన సిలబస్‌పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు. తుమ్మపాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, సిలబస్‌పై అవగాహన పెంచుకుంటే విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు దోహదపడుతుందన్నారు. అనంతరం పాఠశాలలో రికార్డులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పరీక్షా విధానంలో పలు మార్పులు తెచ్చిందని చెప్పారు. గతంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండే గ్రేడింగ్ విధానాన్ని ప్రస్తుతం 9, 10వ తరగతులకు కూడా వర్తింపజేసినట్లు చెప్పారు. గతంలో 9, 10 తరగతులకు సబ్జెక్టుకు రెండు చొప్పున 11 పరీక్షలు ఉండేవని, ప్రస్తుతం వీటిని 9కి తగ్గించినట్లు తెలి పారు. ఇంతకు ముందు వంద మార్కుల పరీక్షను 80కి తగ్గించి ఇంటర్నల్‌కు 20 మార్కులు కేటాయిం చినట్లు తెలిపారు.
సీబీఎస్‌ఈ తరహా విధానం అమల్లోకి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని 1300 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలవుతుండగా జిల్లాలోని 53 పాఠశాలల్లో కొనసాగుతోందని చెప్పారు. కంప్యూటర్ విద్య బోధించే ఎడ్యూకాం కాంట్రాక్టర్ గడువు పూర్తికావడంతో ప్రస్తు తం పాఠశాల ఉపాధ్యాయులే కంప్యూటర్ విద్యను బోధిస్తున్నారని చెప్పార.
ఆకస్మిక తనిఖీలకు మూడు బృందాలు
జిల్లాలోని పాఠశాలల పనితీరును ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు డీఈఓ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయుల సమయపాలన, బోధన, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వంటి అంశాలను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 8 గంటలకే ఆయా బృందాలు పాఠశాలలకు చేరుకుని పర్యవేక్షిస్తాయన్నారు.
తాను కూడా వారానికి ఒక రోజు మండల పాఠశాలలను పర్యవేక్షిస్తానని చెప్పారు. టీచర్ల కొరత ఉన్న చోట సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. తుమ్మపాల ఉన్నత పాఠశాలలో ఇద్దరికి ఒక్కరే తెలుగు ఉపాధ్యాయుడున్నారని, ఎస్.సత్యవతమ్మ 2012 నవంబర్‌లో మెడికల్ లీవ్‌పై వెళ్లి ఇప్పటి వరకు జాయిన్ కాలేదని డీఈఓకు హెచ్‌ఎం కె.ఎస్.ఎన్.మూర్తి వివరించారు.
దీంతో 11 సెక్షన్లకు ఒక్కరే బోధన చేయడం ఇబ్బందిగా మారిందని చెప్పడంతో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఈఓ చెప్పారు. ఈయన వెంట మండల విద్యాశాఖాధికారి పి.అచ్యుతరావు ఉన్నారు. అనంతరం డీఈఓ కొత్తూరు ఏఎంఏఏ ఉన్నత పాఠశాలను సందర్శించారు.