బాధితుల కుటుంబసభ్యులతో చర్చిస్తున్న జేసీ–2 బాబూరావు
భవానీపురం (విజయవాడ పశ్చిమ) : ‘బిల్లు కడితేనే డిశ్చార్జ్ చేస్తారట. హాస్పటల్‌లో ఉన్న క్షతగాత్రులను పరామర్శించేందుకు వచ్చి బాధితులకు మెరుగైన చికిత్స చేయాలని, బిల్లు తాము చెల్లిస్తామన్న జిల్లా కలెక్టర్, కావేరి, ఎస్‌బీటీ ట్రావెల్స్ యజమానుల నుంచి ఇప్పుడు స్పందన లేదు. డిశ్చార్జ్ చేయమంటే బిల్లు కట్టాలని హాస్పటల్ యాజమాన్యం చెబుతోంది. మూడు రోజుల నుంచి కట్టుబట్టలతో ఉన్నాం. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలం. జాయింట్ కలెక్టర్–2 బాబూరావును అడిగితే ముందుగా మీరు కట్టేయండి.. తర్వాత మీ ఎకౌంట్‌లో వేస్తామని చెబుతున్నారు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు..’ ఇదీ మూడు బస్సుల ఢీ ఘటన బాధితుల ఆవేదన. ఈ నెల 7వ తేదీన కృష్ణా జిల్లా గరికపాడులో మూడు ట్రావెల్స్ బస్‌లు ఒకదానినొకటి ఢీకొనటం, అనేకమంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 13 మందిని భవానీపురం ఆంధ్రా హాస్పటల్‌లో చేర్పించారు. బాధితులను జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం, ట్రావెల్స్ యజమానులు వచ్చి పరామర్శించారు. ఖర్చులు తాము భరిస్తామని హాస్పటల్ యాజమాన్యానికి చెప్పి వెళ్లారు. దీంతో వైద్యులు క్షతగాత్రులకు సర్జరీలతోపాటు వివిధ వైద్య సేవలు అందించారు.
అయితే గురువారం ఉదయం నుంచి యాజమాన్యం అందించే వైద్య సేవల్లో మార్పు వచ్చిందని బాధితులు తెలిపారు. డిశ్చార్జ్ తతంగం పూర్తి చేశాక.. బిల్లు కడితేనే పంపిస్తామని చెబుతున్నారని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉదయం నుంచి బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆస్పత్రిలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే, విషయం తెలుసుకున్న జేసీ–2 బాబూరావు గురువారం మధ్యాహ్నం హాస్పటల్‌కు వచ్చి బాధితుల కుటుంబసభ్యులతో చర్చించారు. ఇప్పటి వరకు ఎవరూ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఎవరైనా డిశ్చార్జ్ అవ్వదలుచుకుంటే వెళ్లిపోవచ్చని తెలిపారు. కదలలేని పరిస్థితుల్లో ఉన్న రోగులు కొన్ని రోజులపాటు ఇక్కడే ఉండవచ్చని, సర్జరీలు చేసి విశ్రాంతి తీసుకునే రోగులకు ప్రభుత్వ హాస్పటల్‌లో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ఎన్నాళ్లు అవసరమనిపిస్తే అన్నాళ్లు ఉండవచ్చని తెలిపారు. అలాగే డిశ్చార్జ్ అయ్యే దూరప్రాంతాల రోగులకు అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అప్పటి వరకు ఆందోళనకు గురైన బాధితుల కుటుంబసభ్యులు ఊరట చెందారు.
Comments
Please login to add a commentAdd a comment