జ్వరాల బారిన హాస్టల్ విద్యార్థులు
అందని వైద్యం
పట్టించుకోని వార్డెన్
కంభంపాడు(ఎ.కొండూరు) : జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోని ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులు జ్వరాలతో అల్లాడుతున్నారు. వార్డెన్ పట్టించుకోకపోవడంపై విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ ఆరు నుంచి పదో తరగతి వరకు సుమారు వంద మంది హాస్టల్లో ఉన్నారని తెలిపారు. వారం రోజుల నుంచి జ్వరాలు సోకి మూలుగుతున్నా మందు బిళ్ల ఇచ్చేవారు లేరని ఆరోపించారు. సుమారు 15 మంది విద్యార్థులు వైద్యం చేయించుకోవటానికి ఇంటి ముఖం పట్టారు. ప్రవేటు వైద్యశాలలో వైద్యం చేయించుకునే స్తోమత లేని విద్యార్థులు 10 మంది తరగతి గదిలో జ్వరాలతో అల్లాడుతున్నారు.
వార్డెన్ పట్టించుకోకుండా బయట పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఏఎస్‌డబ్ల్యూవో శీలం రాజశేఖర్ మాట్లాడుతూ వార్డెన్ రామస్వామి అనుమతి లేకుండా బయటకు వెళ్లారని ఇతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
దిగి వచ్చిన అధికారులు..
డిప్యూటీ తహశీల్దార్ చాట్ల వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది విద్యార్థులకు వైద్య సేవలు అందించారు.