చోడవరం : ఎస్టీ,ఎస్టీ విద్యార్థులకు కార్పోరేట్ స్ధాయి ఉన్నత చదువు కోసం ప్రస్తుతం ఉన్న హాస్టళ్లస్థానే రెసిడెన్సియల్ స్కూళ్లను ఏర్పాటుచేసేందుకు పరిశీలిస్తున్నామని రాష్ట్ర గిరిజన,సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆదివారం రాత్రి చోడవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్టీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులకు ఖర్చుచేస్తామన్నారు. ఏ గ్రామంలోనైనా 40శాతానికి మించి ఎస్టీ,ఎస్టీలు ఉంటే సబ్‌ప్లాన్ నిధులతో అంతర్గతరోడ్లనిర్మాణం,ఇతర అభివృద్ధి పనులకు వందశాతం నిధులు మంజూరుచేస్తామన్నారు.
విదేశాల్లో చదువుకోసం ఆసక్తి చూపే పేద విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి పథకం ఏర్పాటుచేస్తున్నామని, ఐఏఎస్, ఐపీఎస్ చదువుకోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో ఆర్థికసాయం అందజేస్తామన్నారు. నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధులను తప్పుదారి పట్టించదని, తమ ప్రభుత్వం నిధులను సక్రమంగా వినియోగిస్తుందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. చోడవరం నియోజకవర్గంలో పలు గిరిజన గ్రామాల అబివృద్దికి చోడవరం ఎమ్మెల్యే రాజు ప్రతిపాదనలు ఇచ్చారని, వాటిని మంజూరుకు కృషిచేస్తానని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే రాజు, సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, జెడ్పీటీసీలు మచ్చిరాజు, జోషఫ్ పాల్గొన్నారు.
హాస్టళ్ల స్థానే రెసిడెన్షియల్ స్కూళ్లు
Published Mon, Apr 27 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM
Advertisement