మండుతున్న మన్యం
చింతపల్లిలో 35 డిగ్రీలు నమోదు
చింతపల్లి: మన్యంలో ఎండలు మండుతున్నాయి. మైదాన ప్రాంతలకు దీటుగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో గిరిజనులు విలవిలలాడి పోతున్నారు. సోమ, మంగళవారాలు చింతపల్లిలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చల్లని వాతావరణానికి మారుపేరైన చింతపల్లి ప్రాంతంలో ఈ ఏడాది మర్చిలోనే 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే మన్యంలో వేసవి కాలంలో ఏప్రిల్, మే నెలల్లో అడపా దడపా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఎప్పుడో గాని 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాదు. మార్చిలో కూడా రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా మారిపోతుంది. ఈ ఏడాది వాతావరణం అందుకు భిన్నంగా ఉంది.
పగలు 10 గంటలు దాటితే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం రోడ్లపై తిరగలేని పరిస్థితి. సాయంత్రం 6 గంటలైతే గాని వాతావరణం చల్లబడడంలేదు. ఫ్యాన్లు తిరగనిదే నిద్ర పట్టడంలేదు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటాయోనని ఈ ప్రాంత గిరిజనులు బెంబేలెత్తి పోతున్నారు. హుద్‌హుద్ తుఫాన్ కారణంగా భారీ ఎత్తున చెట్లు నేల కూలడం వల్ల కూడా వాతావరణంలో భారీ మార్పులకు కారణమయిందని శాస్త్రవేత్త దేశగిరి శేఖర్ తెలిపారు. శీతాల పానియాల కన్నా మజ్జిగ ఎక్కువగా తాగితే మంచిదని లంబసింగి వైద్యాధికారి కొప్పుల రవి సూచించారు.