ఎందుకొచ్చాంరా‘బాబు’
- గంటా బృందంలో అభద్రత
- సహకారంలేక, పార్టీలోనూ మద్దతులేక సతమతం
- వెంటాడుతున్న ఏకాకి భావన
- తొందరపడ్డామా? అంటూ మదనపాటు
సాక్షి,విశాఖపట్నం : ఘనంగా ఊహించుకున్నారు. ఎర్రతివాచీ పరుస్తారనుకున్నారు. బాబుతో పాత సాన్నిహిత్యం పెద్దపీట తెచ్చిపెడుతుందని భ్రమపడ్డారు. తీరాచూస్తే అవమానాలు, అవహేలనలు, ఎత్తిపొడుపులు.. నేతలు,కార్యకర్తల నుంచి ఈసడింపులు..అధినేత నుంచి కొరవడ్డ ఊరడింపులు..
ఇదీ ప్రస్తుత గంటా బృందం రాజకీయ పరిస్థితి. కాంగ్రెస్‌నుంచి టీడీపీలో చేరిన వీరంతా పార్టీలో గౌరవంలేక విలవిల్లాడుతున్నారు. అసలు పార్టీలోకి ఎందుకొచ్చాంరా బాబు అనుకుని మధనపడుతు న్నారు. టీడీపీలో చేరిన గంటాతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవంతిశ్రీనివాస్,పంచకర్ల రమేష్,కన్నబాబురాజు,చింతలపూడి బృందాన్ని అభద్రతా భావం వెన్నాడుతోంది. అయ్యన్నను ఎదుర్కోలేక గంటా దిగాలుపడ్డారని తెలిసింది.
చంద్రబాబు ముందే నిందించినా తనను ఊరడించకపోవడంతో పార్టీలో ఊహించుకున్నంత విలువలేదని భావిస్తున్నట్లు భోగట్టా.ఎక్కడ టిక్కెట్ వచ్చినా క్యాడర్ మద్దతు ఉంటుందా?లేదా? అనే డోలాయమానంలో ఉన్నారు. కన్నబాబు వెంట ఎలమంచిలో కాంగ్రెస్ క్యాడర్ రావడానికి ససేమిరా అంటోంది. క్యాడర్‌ను వెంట రమ్మంటున్నా వారంతా కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ కార్యకర్తలు కన్నబాబు రాజు అరాచకాలు,వేధింపులను గుర్తుకు తెచ్చుకుంటూ తలోదిక్కు పార్టీని వీడుతున్నారు.
చంద్రబాబు కూడా ప్రజాగర్జనలో గంటాతో మినహా ఈయనతో మాట్లాడలేదు.పార్టీలో చేరేముందు తనను చూసి బాబు నువ్వేనా?కన్నబాబు అంటూ ఎగాదిగా చూశారని ఈమధ్య చెప్పుకుని సంగతి తెలిసిందే. ఈయనకు టిక్కెట్‌పై బెంగపట్టుకుంది. భీమిలి ఎమ్మెల్యే అవంతి తాను ఎమ్మెల్యేగా పోటీచేస్తానని బహిరంగంగా ప్రకటించడంతో క్యాడర్ భగ్గుమంటోంది. టీడీడీలో చేరకముందు పార్టీ కార్యకర్తలను రకరకాలుగా వేధించిన సంఘటనలు గుర్తుచేసుకుని వీరంతా రగిలిపోతున్నారు. ఈమధ్య బాబుకుకూడా ఫిర్యాదు చేశారు. ఈయనకు టిక్కెట్ ఇస్తే రెబల్ అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్,టీడీపీ క్యాడర్ కలిసిరాక,చంద్రబాబు వద్ద వ్యక్తిగతంగా పలుకుబడిలేక,పూర్తిగా గంటాపైనే ఆధారపడ్డంతో పార్టీలో మద్దతు దొరకడం లేదనే వేదనతో ఉన్నారు
పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లపై ఉత్తరం కార్యకర్తలు, ఇంఛార్జి భరణికాన ఊగిపోతున్నారు. ఈయనకు సహకరించకూడదని తీర్మానించుకున్నారు. గాజువాక ఎమ్మెల్యే చింతలపూడికి వెంట నేతలు,కార్యకర్తలు ఎవరూలేరని తెలుస్తోంది. టిక్కెట్ వస్తుందనే గ్యారంటీకూడా లేకపోవడంతో భవిష్యత్తు ఈయనకు అర్థంకావడంలేదు. ఈనలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎవరి మద్దతు దొరక్క గంటాతోనే ఎక్కువసేపు గడుపుతున్నారు.