టీడీపీకీ ఝలక్?
=కాంగ్రెస్ ఎమ్మెల్యేల దోబూచులాట
=తర్వాతి ఎత్తుపై సందేహాలు
=కిరణ్ కొత్త పార్టీయే కారణమట
సాక్షి, విశాఖపట్నం: కొత్తపాట పాడనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీకీ ఝలక్ ఇస్తారా? ఒకవైపు లోపాయికారీగా మంతనాలు జరుపుతూనే మరోవైపు కొత్త పార్టీ కోసం ఎదురు చూస్తున్నారా? ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీకి చివరి నిమిషంలో కోలుకోలేని దెబ్బకొడతారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమేమోనన్న సందేహం కలుగుతోంది. కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలని ఇప్పటికే గట్టిగా నిర్ణయించుకున్న ఈ ఎమ్మెల్యేలు లోపాయికారీగా ఇతర పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు సహచర ఎమ్మెల్యేలైన చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, అవంతి శ్రీనివాస్, కన్నబాబు టీడీపీలోకి చేరుతారన్న ఊహాగానాలు విన్పించాయి. మరో ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ కూడా ఏదొక పార్టీలో జంప్ చేసే అవకాశం ఉందన్న విన్పిస్తోంది. కానీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారని, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్న వాదన తాజాగా తెరపైకి రావడంతో వీరంతా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ శుక్రవారం పిచ్చాపాటీగా మాటాడుతూ చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి.
సీఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని, మేనిఫెస్టో తయారవుతోందని, జెండా, ప్రచార పోస్టర్లను డిజైన్ చేసే పనిలో ఉన్నారని వినవస్తున్న మాటలు తన దృష్టికీ వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం క్యాంపు ఆఫీసులో ఈ విషయాలు చర్చకొచ్చాయని గుట్టు విప్పారు. ఈ నేపథ్యంలో.. సీఎం కొత్త పార్టీ కారణంగానే మంత్రి గంటాతో పాటు సహచర ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి సంశయిస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకవైపు టీడీపీతో లోపాయికారీగా మంతనాలు జరుపుతూనే మరోవైపు కొత్త పార్టీ కోసం ఎదురు చూస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఒక్కసారి వదిలిన పార్టీలో మళ్లీ చేరితే ప్రజలు హర్షించరని,కొత్త పార్టీలో చేరితే అంత వ్యతిరేకత రాదన్న అభిప్రాయంతో మంత్రి గంటా ఉన్నట్టు సమాచారం.ఈ క్రమంలో టీడీపీకి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ కొత్త పార్టీ రాకపోతే టీడీపీయే గత్యంతరం కావచ్చన్న వాదన విన్పిస్తోంది.
గంటాకు షోకాజ్ నోటీసుపై చర్చ
కాంగ్రెస్‌కు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల కారణంగా గంటా శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసు వచ్చిందనేదానిపై పార్టీలో విసృ్తత చర్చ జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కాంగ్రెస్‌తో మంత్రి గంటా తెగతెంపులు చేసుకోవడమే తరువాయి అని గుసగుసలు వినవస్తున్నాయి.