
ఇంటింటా తనిఖీలు
పొంచి ఉన్న ఉగ్రవాద దాడులు, అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పలాస మండలంలోని శాసనాం, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని ఏఎస్ పేట, టెక్కలి పంచాయతీలోని చేరీవీధిల్లో శుక్రవారం ఇంటింటా తనిఖీలు నిర్వహించారు. అనుమానితులకు ఆశ్రయం కల్పించొద్దని హెచ్చరించారు.
పలాస/ఇచ్ఛాపురం/టెక్కలి: పలాస మండలం శాసనాం గ్రామాన్ని శుక్రవారం సాయంత్రం పోలీసు బలగాలు ఒక్కసారి చుట్టుముట్టారుు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటిని(కార్డెన్స్ సెర్చింగ్) తనిఖీ చేశారు. తాళం వేసిన ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు చెందిన మొత్తం పోలీసు సిబ్బంది నాలుగు విభాగాలుగా విడిపోయి ఏక కాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కాశీబుగ్గ సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో నాటుసారా విక్రయించకూడదని, అపరిచితులు గ్రామంలోకి వచ్చినట్లయితే వెంటనే సమాచారం అందజేయాలని సూచించారు. పండుగ సమయాల్లో దొంగతనాలు జరగడానికి అవకాశం ఉందని, ఎవరైనా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లినట్లయితే సమాచారమివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ ఎస్‌ఐలు ఆర్.వేణుగోపాలరావు, బి.శ్రీరామ్మూర్తి, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని ఏఎస్ పేట గ్రామంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.అవతారం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీఐతో పాటు ఇచ్ఛాపురం, కవిటి ఎస్సైలు కె.వాసునారాయణ, బి.రామారావు, మధుసూదనరావులు సిబ్బం దితో కలిసి ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడెంటిటీ కార్డులు, రేషన్ కార్డులను పరిశీలించారు. వాహన పత్రాలను పరిశీలించారు. పత్రాలు చూపని రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
టెక్కలిలో గత కొంత కాలంగా సమస్యాత్మకంగా ఉన్న చేరీవీధిని పోలీసు బలగాలు చుట్టుముట్టారుు. ఇటీవల ఇదే ప్రాంతానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు కోళ్ల అప్పన్న హత్యకు గురికావడం, సంఘ విద్రోహ శక్తులు తిష్టవేశాయన్న సమాచారంతో పోలీసులు ఇంటింట తనిఖీలు నిర్వహించారు.