భయం గుప్పిట్లో కార్మికులు
రాయికల్ : సౌదీలో భారత కార్మికుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఆర్థిక మాంధ్యంతో కంపెనీలు మూతపడి కార్మికులు రోడ్డున పడితే.. ఈ క్రమంలోనే పోలీసులు తనిఖీలు చేస్తూ దొరికిన వారిని దొరికినట్లు జైళ్లకు పంపిస్తున్నారు. సౌదీలోని రియాద్, జెడ్డా ప్రాంతాల్లో రోజురోజుకు ఇలాంటి అరెస్టులు పెరిగిపోతున్నాయని తెలంగాణకు చెందిన పలువురు కార్మికులు ‘సాక్షి’కి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలోని కరీంనగర్, ఆది లాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కార్మికులు ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు.
మోసాలూ కారణమే..:గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులను సౌదీలోని పలు కంపెనీల్లో మంచి ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి సౌదీకి తీసుకువచ్చిన అనంతరం కపిళ్లు(అక్కడి ఏజెంట్లు) అక్కడికి వచ్చిన తర్వాత అనుకున్న ఉద్యోగం పాటు వేతనం సరిగా ఇవ్వకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కపిళ్లు కార్మికుల పాస్‌పోర్టులను తమ వద్దనే ఉంచుకుని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తే తమకు కమిషన్ ఇవ్వాలని హుకూం జారీ చేస్తున్నారు. దేశం కానీ దేశానికి అప్పు చేసి వచ్చిన కార్మికులు దిక్కుతోచని స్థితిలో కపిళ్లకు జీతంలో 200 రియాళ్లు ఇస్తున్నారు.
కొంత కాలంగా కంపెనీలు మూతపడటం.. వేతనాలు రాకపోవడంతో కపిళ్లకు నెలానెలా చెల్లించే 200 రియాళ్లను కార్మికులు ఇవ్వలేకపోతున్నారు. దీంతో కపిళ్లే నేరుగా సౌదీలోని పోలీసులకు(సుల్తాలకు) సమాచారం ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి సమాచారం మేరకు పోలీసులు వీరిని అరెస్టు చేసి జైలులో పెడుతున్నారు. జైలులో ఒకే గదిలో 200 నుంచి 300 మందిని ఉంచడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. భోజనంగా ఒక బన్ను, టీ మాత్రమే ఇస్తున్నారని.. ఇంటికి ఫోన్ చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.
పట్టించుకోని అధికారులు..
సౌదీలో అకారణంగా పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టినప్పటికీ భారత ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవ డం లేదని కార్మికులు వాపోతున్నారు. తమ కు పాస్‌పోర్టు ఉన్నప్పటికీ అకామ (వర్క్ పర్మిట్) కార్డు లేకపోవడంతో అరెస్ట్‌లు చేస్తున్నారని, దీనిపై భారత ఎంబసీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను స్వరాష్ట్రానికి తీసుకురావడంతో పాటు జైలులో మగ్గుతున్న వారిని విడిపించాలని కోరుతున్నారు.