తడపకుండానే మోపెడు
Published Thu, Jan 2 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
సాక్షి, కాకినాడ : ఇళ్ల నిర్మాణానికి వినియోగించేటప్పుడు ఇటుకలను తడుపుతారు. దాంతో అవి అంతకు ముందు కన్నా బరువెక్కుతాయి. కానీ, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల కింద ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి ఇటుకలు తడపకుండానే భారమవుతున్నాయి. ప్రభుత్వం నిర్మిత కేంద్రాల ద్వారా సరఫరా చేసే ఇటుకలపై ‘వ్యాట్’ విధించింది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది వివిధ ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు నిర్మించుకుంటున్న పేదల పరిస్థితి. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న మొత్తం సరిపోక ఇప్పటికే లబ్ధిదారులు అప్పుల బారిన పడుతున్నారు. నిన్నకాక మొన్న సిమెంట్ ధరను అమాంతం పెంచేసిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా నిర్మాణ సామగ్రిపై 14.5 శాతం విలువ ఆధారిత పన్ను విధించాలని నిర్ణయించడం గృహనిర్మాణ లబ్ధిదారులకు అశనిపాతంగా తయారైంది.
ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని భారీగా పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ధరల పెంపు, పన్నుల భారంతో సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఈ ఏడాది ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని పల్లెల్లో రూ.45 వేల నుంచి రూ.75 వేలకు, పట్టణాల్లో రూ.55 వేల నుంచి రూ.80 వేలకు,ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు లక్షా 05వేలకు పెంచారు. అయితే రోజురోజుకూ ఆకాశానికి ఎగబాకుతున్న ముడిసరుకుల ధరలు, కూలీ రేట్ల కారణంగా ఈ మొత్తం ఏమూలకూ సరిపోవడం లేదు. ఇది చాలదన్నట్టుగా ఇటీవలే సిమెంట్ ధరను బస్తాకు రూ.50కు పైగా పెంచేసింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిర్మిత కేంద్రాల్లో తయారయ్యే ఇటుకలపైనా వ్యాట్ భారం మోపింది.
గతంలో ఈ పన్ను బహిరంగ మార్కెట్‌లోని ఇటుకలపై మాత్రమే విధించే వారు. శాఖాపరంగా సరఫరా చేసే నిర్మాణ సామగ్రి ధరలు ఈ విధంగా పెంచుకుంటూ పోతే ప్రభుత్వం మంజూరు చేసే అరకొర సాయంతో ఏ విధంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగలమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 2013-14 ఆర్థికసంవత్సరంలో 33,623 గృహాలు నిర్మించాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 9,664 ఇళ్ల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇక జీవో-44, స్పెషల్ రిజర్వు కోటా కింద జిల్లాకు 52,161 గృహాలు, రచ్చబండ -1, 2లలో 92,945 గృహాలు మంజూరు చేశారు. మొత్తమ్మీద జిల్లాలో ఇందిరమ్మ పథకంతో పాటు వివిధ పథకాల కింద మంజూరైన వాటిలో 49,767 ఇళ్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఈ పథకాల లబ్ధిదారులంతా పెరిగిన సిమెంట్ ధరలకు తోడు వ్యాట్ భారంతో తల్లడిల్లిపోతున్నారు.
గిరాకీ ఎక్కువ.. తయారీ తక్కువ
జిల్లాలో ఆరు నిర్మిత కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో నెలకు 25 వేల ఇటుకలు తయారవుతాయి. జిల్లాలో నిర్మాణ దశల్లో ఉన్న సుమారు 50 వేల ఇళ్లకు కనీసం నాలుగుకోట్లకు పైగా ఇటుకలు అవసరమవుతాయి. కానీ ప్రస్తుతం కేవలం లక్షన్నర లోపు మాత్రమే ఇటుకలు మాత్రమే తయారవుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకున్నప్పటికీ వీటిపై వ్యాట్ భారం మోపడం పట్ల లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12ఇంటు8ఇంటు 4 సైజులో ఉన్న ఇటుక ధర గతంలో రూ.10 ఉండేది. వ్యాట్ భారంతో అది రూ.12కు చేరనుంది. గృహనిర్మాణ శాఖ లెక్కల ప్రకారం ఒక ఇంటికి 1000 నుంచి 1500 మేర ఇటుకలు అవసరమవుతాయి. వ్యాట్ పుణ్యమాని ఒక్కొక్క లబ్ధిదారునికి రూ.3 వేల వరకు అదనపు భారం పడుతుంది. నిర్మాణ సామగ్రి సరఫరా కూడా అరకొరగానే సాగుతోంది. పూర్తిస్థాయిలో సరఫరా లేకపోవడంతో లబ్ధిదారుల్లో కొంత నిరాశ నెలకొంది. గతంలో ఇటుకలు, ద్వార బంధాలు, కిటీకీలు, సరపఫరా చేసేవారు. ప్రస్తుతం ఇటుకలనే సరఫరా చేస్తున్నారు.
నిర్మిత కేంద్రాల్లో తయారు చేసే ద్వారబంధాలు, కిటికీలకు డిమాండ్ లేదని చెబుతున్నారు. నిర్మిత కేంద్రంలో గతంలో తయారు చేసే ఇటుకలు ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఇళ్లకు ఒక మూలకు కూడా సరిపోవు. వ్యాట్ ప్రభావం బహిరంగ మార్కెట్‌లో దొరికే ఇటుకలపై కూడా పడడంతో ఆ మేరకు లబ్ధిదారులపై భారం పడుతోంది. గత ఏడాది వరకు ఈ పన్ను లేదు. ఈ సంవత్సరమే కొత్తగా అమలు చేస్తున్నారు. నిర్మిత కేంద్రాల ఇటుకలపై కూడా వ్యాట్ విధింపు ప్రభావంతో బహిరంగ మార్కెట్లో ఇటుకల రేటుకు రెక్కలు వస్తాయని, ఇప్పటికే మంజూరయ్యే గృహరుణానికి రెండు రెట్లు అప్పు చేస్తే కానీ ఇంటి నిర్మాణం పూర్తి చేయలేకపోతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ భారాన్ని తగ్గించకపోతే.. పక్కా ఇళ్లపై ఆశను వీడి, పూరిగుడిసెల్లో తలదాచుకోవడమే మేలంటున్నారు.
Advertisement
Advertisement