ఇంటి గుట్టు రట్టే.. | house ..secret will be | Sakshi
Sakshi News home page

ఇంటి గుట్టు రట్టే..

Jun 7 2014 3:07 AM | Updated on Oct 16 2018 6:27 PM

ఇంటి గుట్టు రట్టే.. - Sakshi

ఇంటి గుట్టు రట్టే..

ఒంగోలులో ఇష్టారీతిన ఇంటి పన్నుల విధింపునకు చెక్‌పడనుంది. అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల్లో టెన్షన్ మొదలైంది.

ఒంగోలులో ఇష్టారీతిన ఇంటి పన్నుల విధింపునకు చెక్‌పడనుంది. అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల్లో టెన్షన్ మొదలైంది. నగర పాలక సంస్థ సిబ్బందిని కాదని, మున్సిపల్ పరిపాలనా విభాగం డెరైక్టర్ ఒక ప్రైవేటు సంస్థకు నగరంలోని ఇళ్ల సర్వే బాధ్యతను అప్పగించారు. ఈ సర్వే దాదాపు పూర్తికావొచ్చింది. రెండంతస్తులుంటే ఒకదానికే పన్ను విధించడం.. ఇంటి నిర్మాణ  స్థలాన్ని తక్కువగా చూపడం.. వ్యాపార సంస్థలకు ఇంటి పన్నునే వసూలు చేయడం వంటి అక్రమాలను సర్వే బృందం గుర్తించినట్లు సమాచారం. వీటి ఆధారంగా అక్రమాలకు మూలమైన అధికారులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.
 
నగరంలో ఇంటి పన్ను విషయంలో కొంతమంది నగరపాలక సిబ్బంది చేతివాటానికి అలవాటుపడ్డారు. కొన్ని నిర్మాణాలకు ఇష్టారీతిన పన్నులు వేయడం, కొన్నింటికి చదరపు అడుగులు తక్కువ చూపడం, ఒకే విధమైన ఇళ్లకు వేర్వేరుగా పన్నులు విధిస్తుండడంతో నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. పన్ను తక్కువగా మదింపు చేసేందుకు సిబ్బంది ఒక్కో గృహానికి వెయ్యి నుంచి 2వేల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. మరికొన్ని చోట్ల రెండంతస్తుల భవనానికి సైతం కేవలం దిగువ అంతస్తుకు మాత్రమే పన్ను వేసి సరిపెడుతున్నారు. అంతే కాకుండా రెండు ఉన్నా ఒకే పోర్షన్ కింద చూపిస్తున్నారు. కొన్నిచోట్ల రోడ్డును ఆక్రమించి కట్టిన ఇళ్లకు అదనపు పన్ను వేయాల్సి ఉన్నా ఆమ్యామ్యాలు పుచ్చుకుని సిబ్బంది నోరుమెదపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇష్టారాజ్యంగా సాగుతున్న భారీ నిర్మాణాలు సిబ్బందికి కాసులు కురిపిస్తున్నాయి.

 ప్రస్తుతం సిబ్బందికి సంబంధం లేకుండా నగరంలో ప్రైవేటు వ్యక్తులు ప్రతి ఇంటికీ డోర్ నంబర్లు వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దాదాపు ముగించారు. డోర్ నంబర్ల వారీగా కూడా సర్వే మొదలైంది.ఇంటి నిర్మాణ కొలతలను సిబ్బంది రికార్డుల్లో పొందుపరిచిన సమాచారంతో సరిపోల్చుకుంటున్నారు. రికార్డులకు, వాస్తవ నిర్మాణానికి వివరాలు తేడా ఉన్నాయా, లేవా అనేది గుర్తిస్తున్నారు.అంతస్తులెన్నో కూడా లెక్కిస్తున్నారు. ప్లాన్ ఉందా, లేదా.. ఒకవేళ అక్రమ నిర్మాణం అని గుర్తిస్తే అది ఎన్నేళ్లయిందనే వివరాలనూ ఆరా తీస్తున్నారు.ఇంతవరకు రికార్డులకెక్కని ఇళ్లనూ గుర్తిస్తున్నారు. నమోదు చేసిన వివరాలను సర్వే బాధ్యతలు చేపట్టిన బృందం శాటిలైట్ ద్వారా పరిశీలిస్తుంది.

ఇదిలా ఉంటే, మరికొన్నిచోట్ల వ్యాపారాల నిమిత్తం గృహాలను అద్దెకు ఇచ్చినప్పటికీ వాటికి సాధారణ ఇంటి పన్నులు వేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం డోర్ టు డోర్ సర్వేతో ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారా లేక వ్యాపారం జరుగుతుందా అనే వివరాలు లభ్యం కానున్నాయి. నగర పాలక సంస్థ స్థలాల్లో ఖాళీగా ఎంత స్థలం ఉంది, ఆక్రమణల్లో ఉందా, ఉంటే ఎవరి చేతుల్లో ఉందనే వివరాలూ శాటిలైట్ ద్వారా గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

అక్రమాల నిగ్గుతేలితే ఇబ్బందే

సర్వేలో అక్రమాలు బట్టబయలైతే సంబంధిత అధికారులను బాధ్యులను చేసేందుకు కమిషనర్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆర్‌ఐతోపాటు బిల్ కలెక్టర్లు బాధ్యులవుతారని సమాచారం. మాన్యువల్‌గా సేకరించిన సమాచారానికి, శాటిలైట్ ద్వారా వచ్చే రిపోర్టులను రెండింటినీ పరిశీలించుకొని తదుపరి చర్యలకు శ్రీకారం చుడతారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం నగరపాలక సంస్థలో కలకలం రేపింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement