అరచేతిలో ఆర్టీసీ సమాచారం | How Can I Track My APSRTC Bus? | Sakshi
Sakshi News home page

అరచేతిలో ఆర్టీసీ సమాచారం

Published Thu, Sep 12 2019 2:11 PM | Last Updated on Thu, Sep 12 2019 2:20 PM

How Can I Track My APSRTC Bus? - Sakshi

మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్లాలనుకుంటున్నారా..? అలాగే మీరు వెళ్లే ఊరికి బస్సులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఆ బస్సు ఎక్కడుందో తెలుసుకోవాలా.. బస్సులో ఆకతాయిల వేధింపులా...? సమస్య ఏదైనా.. సమాచారం తెలుసుకోవాలన్నా చాలా సులువు. అదేంటో తెలుసుకుందామా..? సమస్యలపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా..? మీ చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటే చాలు ఆర్టీసీ సేవలన్నీ పొందే వెసులుబాటు ఉంది. ఆర్టీసీ లైవ్‌ట్రాక్‌ యాప్‌ ద్వారా ఆర్టీసీ సేవలు సులువుగా తెలుసుకోవచ్చు.

ఆర్టీసీ లైవ్‌ ట్రాక్‌ యాప్‌
ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రయాణం కొనసాగించడానికి ఏపీఎస్‌ ఆర్టీసీ సాంకేతికతను వినియోగిస్తోంది. ఆర్టీసీ లైవ్‌ ట్రాక్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే అన్ని సేవలు పొందే వీలు ఉంటుంది.  దూర ప్రాంతాలకు టిక్కెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవడానికి ఆర్టీసీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. దీంతో బస్‌ స్టాండ్లలో బారులు తీరాల్సిన బాధ తప్పుతుంది.

ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి....?
గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఏపీఎస్‌ ఆర్టీసీ లైవ్‌ ట్రాక్‌ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌ దగ్గరలోని బస్టాండు ఎక్కడ ఉందో జీపీఎస్‌ ద్వారా తెలియజేస్తుంది. ప్రారంభ, గమ్య స్థానాలను యాప్‌లో నమోదు చేయగానే రెండు ప్రదేశాల మధ్య ఎన్ని బస్సులు ఉన్నాయో? ఏ సమయానికి ఉన్నాయో? డ్రైవర్, కండక్టర్‌ వివరాలు అందులో కనిపిస్తాయి. రిజర్వేషన్‌ చేసుకున్న తర్వాత సర్వీసు నంబరు ఆధారంగా బస్సు ఎక్కడుందో యాప్‌ ద్వారా తెలిసిపోతుంది. మనకు కావాల్సిన బస్సు నంబరు యాప్‌లో నమోదు చేయగానే అది ఎక్కడుందో జీపీఎస్‌ ద్వారా తెలుస్తుంది.

నిరీక్షణకు తెర
గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు ఏ సమయానికి వస్తాయో తెలియని పరిస్థితి. అయితే కొన్ని సమయాల్లో ముందు సమాచారం చెప్పకుండానే రద్దు చేస్తుంటారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే బస్సు ఎక్కడుంది? ఏ సమయానికి వస్తుంది.? తెలిసిపోతుంది. దీనివల్ల ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు–వెలుగు బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం పెరిగిందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల వారే ఈ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతి బస్సులో జీపీఎస్‌ ‘ట్రాకింగ్‌’ పరికరాన్ని అమర్చారు. దీంతో బస్సును ట్రాకింగ్‌ చేయడం సాధ్యపడుతోంది. గత ఏడాది అధికారులు ప్రయాణికులకు విస్తతంగా అవగాహన కల్పించారు. ప్రయాణికులు దీన్ని వినియోగించుకుంటే భద్రత, సుఖవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందనడంలో సందేహం లేదు.

మహిళలకు భద్రత
ఈ యాప్‌ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది బస్సు ఏ సమయానికి ఉందో తెలియక రోడ్డుపై నిరీక్షిస్తుంటారు. ఆ సమయంలో మహిళలు, ఆకతాయిల వేధింపులు, చైన్‌ స్నాచర్స్‌ నుంచి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్‌ ద్వారా బస్సు వచ్చే సమయానికి అక్కడికి చేరుకోవచ్చు. ఒకవేళ బస్సులో ఇబ్బందులు ఎదురైతే ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లైవ్‌ ట్రాక్‌ ద్వారా పోలీసులు బస్సున్న చోటికి నిమిషాల్లో చేరుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement