
రైతులను ఎన్నాళ్లు మోసగిస్తారు
మాచర్లటౌన్ : రైతుల సమస్యలను పరిష్కరించకుండా వివిధ సాకులతో ఎన్నాళ్లు మోసం చేస్తారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. శనివారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ పూర్తిగా జరగక కరువుతో అల్లాడుతున్న గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులకు నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ అధికారులు పక్షపాతం చూపిస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని పీఆర్కే ప్రశ్నించారు.
కృష్ణా బోర్డు ఏర్పాటు చేసేంత వరకు ఎవరి ప్రాంతంలో వారు నీటిని విడుదల చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఆ సమస్యను పట్టించుకోకపోవటం వలన గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. తెలంగాణ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా నీటిని విడుదల చేయించటంలో చంద్రబాబు అలసత్వం వహిస్తూ రైతులను మోసగిస్తున్నారన్నారు.
జీతాలకు కూడా డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు విహార యాత్రల పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ విదేశాల్లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. వాస్తు పేరుతో సీఎం కార్యాలయ మరమ్మతులకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు. రాజధానికి రైతుల నుంచి భూములను లాక్కొని మోసగిస్తున్నారని ఆరోపించారు. రైతులు త్వరలోనే ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతుండటంతో టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ దోచుకునే పనుల్లో ఉంటున్నారన్నారు.
రైతు, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టనున్న దీక్షకు అందరూ తరలివచ్చి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు శౌరెడ్డి గోపిరెడ్డి, నవులూరి భాస్కరరెడ్డి, కళ్లం కృష్ణవేణి రామాంజనేయరెడ్డి, ఎంపీపీలు ఓరుగంటి పార్వతమ్మ, కుర్రి సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.