కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్: ఇప్పుడే అధికారులు మాట వినడంలేదు... ఇక పార్టీ అధికారం కోల్పోతే తమ పరిస్థితి ఏమిటని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరాశనిస్పృహలను వ్యక్తం చేశారు. స్థానిక కళ్యాణదుర్గం భవన్‌లో గురువారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జయరాం పూజారి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి రఘువీరా, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిలకు వారు తమ ఇబ్బందులు తెలుపుతూ పార్టీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. కనుకూరు మల్లప్ప, ఏ-బ్లాక్ అధ్యక్షుడు గంగాధర, మాజీ ఎంపీటీసీ దొణస్వామి, మాజీ ఎంపీపీ రామన్న, కంబదూరు రాధమ్మ, తదితరులు మాట్లాడారు.
విద్యుత్, ఐకేపీ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యకర్తల సమావేశమంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారని నిలదీయాలి కానీ స్వప్రయోజనాల కోసం కాదని మంత్రి వారిని మందలించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లును చిత్తుగా ఓడిస్తామన్నారు. ఓట్లు, సీట్ల కోసం టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ కక్కుర్తి పడ్డాయని విమర్శించారు. సీమాంధ్రలో రాజధానికి రూ.5లక్షల కోట్లు ప్యాకేజీ ఇవ్వాలని కోరిన చంద్రబాబు సమన్యాయం పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి మద్దతు ఇస్తున్న బీజేపీతో జతకట్టేందుకు ఆయన యత్నిస్తూ కమలాన్ని సైకిల్‌పై ఊరూర ఊరేగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
జీడీపల్లికి నీరు తీసుకురావడంతో 50 సంవత్సరాల కల నెరవేరిందన్నారు. కాంగ్రెస్‌కు గెలుపు, ఓటములు సహజమేనని, ఎవరూ బయటకు వెళ్లిన బయపడేది లేదన్నారు. గతంలో మాదిరి ఈసారి కార్యకర్తల సమావేశంలో ఉత్సాహం కనిపించలేదు. కాంగ్రెస్ నాయకులు బాల నరేంద్రబాబు, తలారి వెంకటేశులు, లాయర్ దేవేంద్ర, కరణం తిప్పేస్వామి, ఎర్రనాగరాజు, రామాంజినేయులు, గోవిందరెడ్డి, మంజునాథ్‌రెడ్డి, మంజునాథచౌదరి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
అధికారంలోకి రాకపోతే ఎలా? కాంగ్రెస్ కార్యకర్తల నిర్వేదం
Published Fri, Jan 3 2014 2:50 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement