వలస పక్షి రఘువీరా
* మూడు నియోజకవర్గాలు మార్చిన వైనం
* 2009లో కళ్యాణదుర్గం, ఈసారి పెనుకొండ నుంచి
ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వలస పక్షిగా మారారు. 25 ఏళ్ల ఆయన రాజకీయ అనుభవంలో మూడుసార్లు నియోజకవర్గాలు మార్చడమే ఇందుకు నిదర్శనం. 2009లో కళ్యాణదుర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ఆయన ఈసారి 2014లో పెనుగొండ నియోజకవర్గానికి మకాం మార్చారు. మడకశిరలో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ లేకపోవడం కారణంగానే ఆయన ప్రతిసారి ఇతర నియోజకవర్గాలను వెతుక్కోవలసి వస్తోందని రాజకీయ విమర్శకులు అంటున్నారు.
రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించే రఘువీరారెడ్డి ఒకే నియోజకవర్గంలో స్థిరంగా గెలుపొందే బలాన్ని పెంచుకోలేక పోతున్నారన్న విమర్శ లేకపోలేదు. బీజేపీలో అతితక్కుత కాలం పనిచేసిన రఘువీరారెడ్డి 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మడకశిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2004 ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తిరిగి గెలుపొందారు.
2004లో గెలుపొందిన అనంతరం మహానేత వైఎస్‌ఆర్ క్యాబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా పదవిని అలంకరించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో మడకశిర ఎస్సీ రిజర్వేషన్‌గా మారింది. అంత వరకు ఎస్సీ రిజర్వేషన్‌గా ఉన్న కళ్యాణదుర్గం జనరల్‌గా మారింది. మహానేత వైఎస్‌ఆర్ చలువతో 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవిని చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఎదురుగాలి వీచడంతో ఆయన ఈసారి 2014 ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నారు.