నీళ్లు లేకుండా..ఎలా బతికేది? | how to live without water | Sakshi
Sakshi News home page

నీళ్లు లేకుండా..ఎలా బతికేది?

Published Sun, Nov 16 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

నీళ్లు లేకుండా..ఎలా బతికేది?

నీళ్లు లేకుండా..ఎలా బతికేది?

‘మదనపల్లెలో తాగేందుకూ నీళ్లు దొరకడంలేదు.గొంతు తడవాలంటే మూడు రూపాయలు ఖర్చుచేయాల్సిందే.మున్సిపాలిటీ వాళ్లు వదిలే నీళ్లు ఏ మాత్రం సరిపోవు.కొళాయిల్లో సన్నగా నీరొస్తోంది. అదీ గంట మాత్రమే. బిందెనిండేసరికి అరగంటపైనే పడుతోంది. అసలే కరువు నేల.భార్యాభర్త పనికెళితేనే పట్టెడన్నం దొరుకుతుంది. నీళ్లకోసమేఒకరు ఇంటి వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. పస్తులు తప్పడంలేదు.

ప్రయివేటు ట్యాంకర్ల వద్ద మూడు రూపాయలు వెచ్చించిబిందె నీటిని కొనుక్కోవాల్సి వస్తోంది. బిడ్డా..గొడ్డూ ఉండేవాళ్లునీళ్లులేకుండా ఎలా బతికేది?. బతుకుబండిని ఎలా నెట్టుకొచ్చేది’ఇదీ మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల ఆక్రందన.ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకుమున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్ ‘సాక్షి’ తరపున శుక్రవారం విలేకరిగా మారారు. 13వ వార్డుకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
 
కమిషనర్ హామీలు
మీ వార్డుకు విలేకరిగా వచ్చాను. ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నా. అందరూ నీటి సమస్యపైనే ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. బోర్లులేని చోట అదనంగా బోర్లు వేయిస్తా. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తా. ఇక కొందరు రోడ్లు బాగాలేవని, దోమల బెడద ఎక్కువగా ఉందని.. వీధిలైట్లు వెలగడంలేదని చెప్పారు. వీటన్నింటినీ పరిష్కరిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నా.
 
దేవ్‌సింగ్: నమస్తే అమ్మా.. నా పేరు దేవ్‌సింగ్. మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌ను. మీ వార్డులో సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఏయే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు?.
 
సరళ: వారానికి ఒక రోజు మంచినీరు వస్తుంది. అది కూడా సన్నగా కారడంతో బిందె నిండేందుకు అరగంటపైనే పడుతోంది. నీళ్లు ఏమాత్రం చాలడంలేదు. డబ్బు ఖర్చుచేయందే గుక్కతడవడంలేదు. ట్యాంకర్ నీటికి ఐదొందల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తోంది. రెండు, మూడు రోజులకోసారి నీళ్లు వచ్చేలా చూడండి. చేతి బోరు ఉంటే బాగుంటుంది. కొళాయిల్లో నీళ్లు రానప్పుడు నీళ్లు బోరునీటినైనా వాడుకోవచ్చు.
 
దేవ్‌సింగ్: మున్సిపల్ బోర్లులో కూడా నీళ్లు లేవు. దాదాపు 70 బోర్లు ఎండిపోయాయి. వర్షాలు వస్తే తప్ప మంచినీరు మెరుగుపరచలేం. కొంతకాలంగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. తాగునీరు మూడు రోజులకోసారి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. బోరు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం.
 
చంద్రలీల: నా భర్త చనిపోయి ఎనిమిది నెలలు అవుతోంది. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు అందలేదు. కుటంబ పోషణ కష్టంగా ఉంది. దయచేసి పింఛన్ వచ్చేలా చూడండి సామీ.

దేవ్‌సింగ్: మీరు పెట్టుకున్న దరఖాస్తు ఒకసారి మున్సిపల్ కార్యాలయంలో చూపించండి. పరిశీలించి న్యాయం చేస్తాం.
 
జీఆర్ రమాదేవి: వివేకానందనగర్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ మార్గంలో ట్రాక్టర్లు, స్కూల్ వ్యాన్లు అధికంగా తిరడం వల్ల పాడైపోయాయి. వీధిలోకి తాగునీటి ట్యాంకరు వచ్చినా నీళ్లు పట్టుకోలేకపోతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. పలు సార్లు ప్రమాదాలు జరిగాయి. రోడ్లు బాగుచేసి ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.
 
దేవ్‌సింగ్: రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేశాం. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసు అధికారులతో మాట్లాడతా. సమస్య పరిష్కారమయ్యేవిధంగా చర్యలు తీసుకుంటా.
 
అలివేలమ్మ: ఆటోనగర్ రోడ్డులో నీళ్లు సరిగా రావడం లేదు. ఎగువ భాగం కావడంతో నీళ్లు వదిలినా చుక్కనీరు రాదు. ఇబ్బందిగా ఉంది. నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనిగురించి అనేకసార్లు మున్సిపల్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదు.
 
దేవ్‌సింగ్: మీ వీధిలో నీళ్లు సక్రమంగా వచ్చేలా చర్యలు తీసుకుంటాం. వాటర్‌మన్‌ను అడిగి సమస్య తెలుసుకుని అందరికీ నీళ్లు వచ్చేలా చర్యలు చేపడతాం.
 
కరీముల్లా: మా వీధిలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. సాయంత్రం 7 గంటలైనా వీధి దీపాలు వెలగవు. ఉదయం 5 గంటలకు లైట్లు ఆరిపోతాయి. వీధి దీపాలు సరిగా వెలగక చోరీలు జరుగుతున్నాయి. మహిళలు పొద్దుగూకితే రోడ్లపై రావాలంటే ఇబ్బందిగా ఉంది.
 
దేవ్‌సింగ్: వీధిలైట్లు వేసే లైట్‌మెన్లు వీధుల్లో వేసుకుంటూ వస్తారు. దీంతో ఆలస్యమవుతోంది. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తాం. పట్టణం లో ఒకేసారి వీధిలైట్లు వెలిగేలా.. ఒకేసారి ఆరిపోయేలా చర్యలు తీసుకుంటాం. లైట్లు వెలగడం లేదని ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
 
రమేష్‌బాబు: శేష్‌మహల్ ఏరియా వద్ద డ్రైనేజీ పాడైపోయింది. దుర్వాసన వెదజల్లుతోంది. లెట్రిన్‌లోని మలం కూడా కాలువలోకి వస్తోంది. దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం.
 
దేవ్‌సింగ్: పాత డ్రైనేజీ వ్యవస్థ కారణంగా సమస్యగా ఉంది. కొత్త కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.
 
జగన్నాథరెడ్డి: వీధుల్లో దోమల బెడద ఎక్కువ. దోమ కాటుతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఫాగింగ్ చేయలేదు. కాలువల్లో మలాథియాన్ చల్లడం లేదు. చిన్న పిల్లలకు జ్వరాలు సోకుతున్నాయి.
 
దేవ్‌సింగ్: వీధుల్లో ఫాగింగ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. దోమల బెడద నివారణకు కాలువల్లో మలాథియాన్ స్ప్రే చేయిస్తాం. దోమల బెడద నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపడుతాం.
 
రమణమ్మ: నా భర్త చనిపోయాడు. వితంతు పెన్షన్ రాలేదు. జన్మభూమిలో అర్జీ ఇచ్చాను. నాకు పెన్షన్ వచ్చేలా చూడండి.
 
దేవ్‌సింగ్: మీరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మీ సమస్యను తెలియజేస్తూ దరఖాస్తు ఇవ్వండి. ఇందులో అన్ని ధ్రువపత్రాలు జత చేసిఇవ్వాలి. అర్హత ఉంటే కచ్చితంగా పింఛన్‌వచ్చేలా చూస్తాం.
 
విజయ: ఎన్‌వీఆర్ వీధిలో వర్షం వస్తే చాలు రోడ్లుపై నడవలేం. రోడ్లపైనే వర్షపునీరు మడుగులా నిలిచిపోతోంది. దీనికారణంగా దోమలు వస్తున్నాయి. సాయంత్రమైతే దోమల బెడద ఎక్కువ.
 
దేవ్‌సింగ్: కొత్త రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకుంటాం. వర్షపు నీళ్లు నిలిచినచోట్ల మట్టిని తోలిస్తాం. దోమల నివారణకు ఫాగింగ్ చేస్తాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement